iDreamPost
iDreamPost
చూడు..ఒకవైపే చూడు..ఇదీ బాలయ్య బాబు సినిమాలో ఓ పాపులర్ డైలాగ్. కానీ ఇప్పుడు ఆయన బావగారూ దానినే పాటిస్తున్నారు. సినిమాల్లో బాలయ్య చెప్పితే పొలిటిక్స్ లో బాబు ఆచరించడమే ఆశ్చర్యం అనిపిస్తోంది. సీఎంగా ఐదేళ్ల పదవీకాలంలో ఎన్నడూ తాను ఆచరించని, కనీసం అందుకు అంగీకరించని చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లిస్తే , సూక్తులు చెబితే స్వీకరించేవాళ్లు ఎలా ఉంటారు. అయినా చెప్పడమే నాకు తెలిసు..చేసినా చేయకపోయినా సరే అన్నట్టుగా సాగుతోంది ఆయన వ్యవహారం.
చంద్రబాబు అనుకోకుండా హైదరాబాద్ లో ఇరుక్కున్నారు. ఇంట్లోంచి బయటకు రాలేరు..లోపల ఉండలేరు అన్నట్టుగా ఉందాయన పరిస్థితి. దాంతో ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు ఇప్పుడు పదే పదే లేఖలు రాస్తున్నారు. ఇలా విపక్ష నేతలు అధికారంలో ఉన్న వారికి లేఖలు రాయడం కొత్తేమీ కాదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నాటి ప్రతిపక్ష నేత జగన్ సహా అన్ని పార్టీల నేతలు లేఖలు రాశారు. కానీ వాటిని నాటి సీఎం ఖాతరు చేసిన దాఖలాలు లేవు. కనీసం పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు లేఖలు రాస్తూ తనను పరిగణలోకి తీసుకోండి..నా అనుభవాన్ని వాడుకోండి..నా సలహాలు తీసుకోండి అని కోరుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చంద్రబాబు లేఖలను ఆయన పాత మిత్రుడు మోడీ కూడా పట్టించుకోవడం లేదు. చివరకు దేశంలో అన్ని పార్టీల నేతలతో కూడా మాట్లాడేందుకు సిద్ధపడుతున్న మోడీ కనీసం చంద్రబాబు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ట్విట్టర్ లో గానీ , బయట గానీ బాబుకి ఏమాత్రం విలువ ఇవ్వడానికి పీఎం సిద్ధంగా ఉన్న పరిస్థితి ఇప్పటి వరకూ రాలేదు. ఇక సీఎం జగన్ కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు నేర్పిన విద్యనే అవలంభిస్తున్నారు. ఎంత మొత్తుకున్నా ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ పరిస్థితి ప్రచారయావ లేకుండా పూటగడవని చంద్రబాబుకి అంతుబట్టడం లేదు. తాను పదే పదే ప్రాధేయపడుతున్న చందంగా లేఖలు రాస్తున్నా అటు వైపు నుంచి ఉలుకూపలుకూ లేని స్థితి ఆయన సహించలేకపోతున్నారు.
ఆయన ప్రయత్నాల పరంపరలో భాగంగా ఏకంగా వీడియోకాన్ఫరెన్స్ కూడా నిర్వహించేశారు. అత్యవసర కార్యక్రమాలకే మాత్రమే అంతా పరిమితం అయినప్పటికీ చంద్రబాబు మాత్రం తన రాజకీయాలకు సమయం , సందర్భం ఉండదని చాటకుంటున్నారు. టైమింగ్ లేకుండా నిర్వహించే పార్టీ సమావేశాల పేరుతో ప్రచారం వస్తుందని ఆశిస్తున్న ఆయనకు పరిస్థితి బోధపడలేదని బహిరంగం అవుతోంది. బాబు చెప్పిందానికి సై అనడమే తప్ప, కనీసం పరిస్థితిని కూడా ఆయన అర్థమయ్యేలా చెప్పలేని స్థాయిలో సాటి పోలిట్ బ్యూరో ఉండడంతో టీడీపీ రానురాను ఎలా తయారవుతుందో అర్థం కావడం లేదన్నది పరిశీలకుల అభిప్రాయం. కేవలం టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు చూసుకుంటూ, రెండో వైపు వాస్తవాన్ని చూడడానికి నిరాకరిస్తున్న చంద్రబాబు ధోరణి ఇంకెంతగా దిగజారుతుందన్నది అంతుబట్టకుండా ఉందన్నది వారి వ్యాఖ్యానం.
అధికారం ఉన్నంత కాలం చెలరేగిపోయి, ప్రతిపక్షంలోకి రాగానే వల్లించే నీతులకు పెద్ద విలువ ఉండదన్నది ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇప్పటికే గ్రహించి ఉండాల్సింది. కానీ ఆయన మాత్రం జగన్ మీద గురిపెట్టి, జనాలను మరచిపోతున్నారు. జనం నాడిని గుర్తించడంలో విఫలం అవుతున్నారు. కరోనా వంటి ఓ పెద్ద విపత్తు వేళ వ్యవహరించాల్సిన దానికి భిన్నంగా తనకు తోచిందే అంతా ఆచరించాలన్నట్టుగా ఉన్న చంద్రబాబు వైఖరి టీడీపీని గట్టెక్కించడం మాట అలా ఉంచితే మరింత గండంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.