Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)పై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రిపోర్టును ఒక చెత్తగా అభివర్ణించారు. అమరావతిలో జరిగిన అభివృద్ధి కనిపించడంలేదా..? కళ్లు లేని కబోదులా..? అంటూ బీసీజీపై చంద్రబాబు మండిపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిని చంపేస్తున్నారన్నారు. రాజధానికి ఎవరూ రారంటున్నారని, రాజధానికి రాకుండా ఎక్కడిపోతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరు ఉన్నారని తెలిపారు. ఇలాంటిది అమరావతికి ఎందుకు రారని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు అమరావతి మధ్యలో ఉందని, ఆయా ప్రాంతాలకు అమరావతికి మధ్య ఎంత దూరం ఉందో వివరాలు వెల్లడించారు.
‘విజయసాయి ఎవరు..? జిల్లా ఇన్‌చార్జిగా ఎలా పెడతారు..? ఎంపీని ఎలా పెడతారు..? భూములు చూసుకోవడానికా..? కమిషనర్ ల్యాండ్ సెటిల్‌మెంట్ చేస్తున్నారు. విశాఖలో ఐదు నెలల్లో భూములు కొన్నారు. చుక్కల భూములు, ప్రభుత్వములు కొన్నారు. జాయింట్ కలెక్టర్‌ను మార్చి ఇష్టానుసారం లాగేసుకుంటున్నారు. ప్రజలను ఇబ్బందులుపెట్టేందుకు దూరంగా ఉన్న విశాఖను ఎంపిక చేస్తున్నార’ని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్రాంతి పండగ అమరావతి సంక్రాంతి పడుగలా ప్రజలు చేసుకోవాలని కోరారు. తెలుగు జాతి కోసం అమరావతి ని కాపాడుకోవాలని సూచించారు. ఊరూరా అమరావతి కోసం పండగ చేసుకోవాలని, భోగి రోజున జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికనుల తగులబెట్టాలని పిలుపునిచ్చారు.