iDreamPost
android-app
ios-app

బాబు వాదనలో బలమేదీ..?

బాబు వాదనలో బలమేదీ..?

‘‘ అమరావతి నిర్మాణం 60 శాతం పూర్తయింది. అసెంబ్లీ ఉంది. సెక్రటేరియట్‌ ఉంది. హైకోర్టు ఉంది. ఇవన్నీ వదిలేసి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారట. బంగారు బాతు లాంటి అమరావతిని చంపేస్తున్నారు. పెట్టుబడులు పోతున్నాయి. అమరావతి ప్రపంచంలోనే ముఖ్య నగరాల్లో ఒకటిగా ఉంటుంది.’’ ఇదీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్‌ సర్కార్‌ ప్రతిపాదించినప్పటి నుంచీ చేస్తున్న వాదన. చెప్పిన విషయమే పదే పదే చెబుతూ ప్రజలను నమ్మించే విద్యలో చంద్రబాబు ఆరితేరారు. ఇందులో ఆయన అనుకూల మీడియా సహకారం ఎనలేనిది. అయితే సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత బాబు బండారం బయటపడింది. అయినా ఆయన తన పంథాను మాత్రం మార్చుకోకపోవడం విశేషం.

అమరావతి నిర్మాణం 60 శాతం పూర్తయింది, అన్ని భవనాలు ఉన్నాయని బాబు చేస్తున్న వాదన ఉత్త డొల్ల అని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉంది. తాజాగా హైకోర్టులో డీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ బాబు అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌తో బాబు చెబుతున్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదని అర్థం అవుతోంది. సదరు న్యాయవాది.. రాష్ట్ర హైకోర్టుకు శాశ్వత భవనం నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక భవనం హైకోర్టు కార్యకలాపాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

మరి బాబు చెబుతున్నట్లు అమరావతి 60 శాతం పూర్తయితే.. సదురు న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు మాత్రమే చెప్పగలరు. కేవలం హైకోర్టు మాత్రమే కాదు.. ప్రస్తుతం రాజధానిలో ఉన్న అసెంబ్లీ, సచివాలయం కూడా తాత్కాలిక భవనాలే. ఏవీ శాశ్వతం కాదు. వాటి స్థానంలో మళ్లీ కొత్త వాటిని నిర్మించాలి. రాష్ట్రం విడిపోయి కనీసం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఏపీ ప్రజలు అనుభవం ఉందన్న కారణంతో చంద్రబాబుకు అధికారం ఇచ్చారు. అయితే ఆయన మాత్రం రెండు నెలలకు ఓ దేశం తిరుగుతూ టోక్యో తరహా రాజధాని, ఇస్తాంబుల్‌ తరహా రాజధాని, శ్రీలంక తరహా రాజధాని అంటూ కొన్నాళ్లు.. బాహుబలి చిత్రం డైరెక్టర్‌తో రాజధాని డిజైన్లపై చర్చలతో మరికొన్నాళ్లు కాలం వెల్లబుచ్చారు.

కనీసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలకు అవసరమైన భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించి ఉంటే.. ప్రస్తుతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా బాబు చేస్తున్న వాదలనలకు బలం చేకూరేది. కానీ ఆ పని చేయలేదు. పైగా తాత్కాలికం పేరుతో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణంలో దేశంలో ఎవరూ చేయనంత ఖర్చు నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది. స్థలం, మెటీరియల్‌ అంతా తామే పెట్టుకుని రాజభవనం లాంటి నిర్మాణాలను హైదరాబాద్‌ నడిబొడ్డున చదరపు అడుగు 6 వేల రూపాయలకు ఇస్తుంటే.. అమరావతిలో భూమి ప్రభుత్వానిది, ఇసుక ఉచితం.. అయినా సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు చదరపు అడుగు 11 వేల రూపాయలు చెల్లించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ప్రజా ధనం ఏ స్థాయిలో పక్కదారి పట్టిందో ఇక్కడే స్పష్టంగా తెలుస్తోంది. నాడు చంద్రబాబు చేసిన పాపాలే నేడు అమరావతికి శాపాలుగా మారాయని బాబును అభిమానించిన వారే నేడు సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.