Idream media
Idream media
కాదేదీ రాజకీయ రచ్చకు అనర్హం.. ఇది.. తెలంగాణ రాజకీయాలకు అచ్చంగా సరిపోతుంది. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ చుట్టూ ఇప్పుడు పొలిటికల్ ఫైట్ సాగుతోంది. డ్రగ్స్ కేసులోంచి కొందర్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తప్పించిందంటూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కొత్త చాలెంజ్ కు, సరికొత్త సమరానికి దారి తీస్తున్నాయి. మాటలు కోటలు దాటి లైడిటెక్టర్ వద్దకు పోతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేను రెడీ.. నువ్వు రెడీనా అంటూ సవాళ్లు విసురుకుంటే.. మధ్యలో నేను సైతం బీజేపీ కూడా చేరిపోయింది. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ‘వైట్ ఛాలెంజ్’ చుట్టూ తిరుగుతున్నాయి.
ఏంటీ వైట్ చాలెంజ్
తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటడం అనే గొప్ప కార్యక్రమానికి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకుంటున్నారు. అదే బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి, వైట్ ఛాలెంజ్ అంటున్నారు. దీనిలో భాగంగా డ్రగ్స్ విషయంలో వైద్య పరీక్షలకు సిద్ధమా అంటూ పొలిటికల్ నేతలు ఒకరికి మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాను ఏ ఆసుప్రతికి వెళ్ళి అయినా డ్రగ్స్ విషయమై వైద్య పరీక్షలకు సిద్ధమనీ, మంత్రి కేటీయార్ అందుకు సిద్ధమా.? అని రేవంత్ రెడ్డి మొదటిసారి సవాల్ విసిరారు. రేవంత్ విసిరిన సవాల్ విషయమై స్పందించిన కేటీయార్, ‘‘ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే.. రాహుల్ వస్తాడా. చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది. నాకు క్లీన్‌చిట్ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్ క్షమాపణ చెప్తాడా.. ఓటుకు నోట్ల కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో విషయం ఎట్నుంచి ఎటో వెళ్ళిపోతోంది.
అమరవీరుల స్థూపం సాక్షిగా..
టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్, విశ్వేశ్వర్ రెడ్డి సిద్ధం కావాలన్నారు. తాను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తానన్న రేవంత్ అటు నుంచి ఏ ఆసుపత్రి అంటే ఆ హాస్పిటల్‌లో డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం అన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేసుకుని యువతకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. చెప్పినట్లుగానే ఆయన అక్కడకు చేరుకున్నారు.‘‘
Also Read: కేటిఆర్ ఉద్యోగం ఇచ్చారు సరే, కాని ఆమె జీవితంలో ఉన్న మరో పెద్ద కష్టం ఏంటీ…?
ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది?’’ అంటూ రేవంత్ రెడ్డి సర్కారును నిలదీశారు. ‘‘అకున్ సబర్వాల్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే అకున్ సబర్వాల్‌ని తప్పించారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి. విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రేవంత్ పై పరువు నష్టం దావా
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు.
రియాక్ట్ అయిన బండి సంజయ్
ఈ వైట్ ఛాలెంజ్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా స్పందించారు. తాను నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని అన్నారు. తాను నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.
Also Read: వైఎస్సార్ సీపీ జైత్రయాత్ర.. ఏ అంశాలు కలిసొచ్చాయి?
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ తాను రెడీ అన్నారు. చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆయన తేల్చి చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్‌కి తనదైన తరహాలో స్పందించారు. ప్రజాసంగ్రామ యాత్ర తర్వాత టెస్టు కోసం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని అన్నారు బండి సంజయ్. అక్టోబర్ 2వ తేదీన తన పాదయాత్ర ముగియనుందన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత టెస్టుల కోసం వస్తానని చెప్పారు బండి సంజయ్. తనకు ఎలాంటి అలవాట్లు లేవని వెల్లడించారు.
వాస్తవానికి ఈ చాలెంజ్ మంచిదే. డ్రగ్ రహిత తెలంగాణకు ఇది దోహదపడుతుంది. డ్రగ్స్ వల్ల కలుగుతున్న నష్టాలపై ప్రచారానికి దోహదపడుతుంది. అయితే.. అసలు ఉద్దేశాన్ని పక్కనబెట్టడంతో విషయం దారి తప్పుతోంది. ఆయా నేతల సవాళ్లు వైట్ ఛాలెంజ్ నుంచి లైడిటెక్టర్ పరీక్షల వైపు వెళ్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం ఈ వైట్ చాలెంజ్ ను కొనసాగిస్తే మంచిదని ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి నిపుణులు కూడా సూచిస్తున్నారు. దీని వల్ల డ్రగ్స్ కలిగే నష్టాల నుంచి తెలంగాణను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. మరి ఈ చాలెంజ్ మంచివైపు వెళ్తుందా.. పొలిటికల్ వార్ గానే కొనసాగుతుందా చూడాలి.
Also Read:అఖాడా పరిషత్ మహంత్ నరేంద్ర గిరి,సహజ మరణమేనా?