వైఎస్సార్ సీపీ జైత్రయాత్ర.. ఏ అంశాలు కలిసొచ్చాయి?

By Kalyan.S Sep. 21, 2021, 08:00 am IST
వైఎస్సార్ సీపీ జైత్రయాత్ర.. ఏ  అంశాలు కలిసొచ్చాయి?

అధికారంలో ఉన్న పార్టీకి అంగ బ‌లం ఉంటుంది. అర్థ బ‌లం కూడా ఉంటుంది. అందుకే స్థానిక ఎన్నిక‌ల్లో ఎప్పుడూ అధికార పార్టీ అభ్య‌ర్థులే అధిక విజ‌యాలు సాధిస్తారు. అవును అది నిజ‌మే. అయితే.. అధిక విజ‌యాలు సాధిస్తారు కానీ అన్ని చోట్లా విజ‌యాలు అసాధ్యం. కానీ.. వైఎస్సార్ సీపీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. ఫ‌లితాల‌లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తోంది. అప్పుడు కార్పొరేష‌న్లు.. ఇప్పుడు జిల్లా ప‌రిష‌త్ లు రాష్ట్రంలో ఎన్ని ఉంటే.. అన్నీ ఆ పార్టీకే ద‌క్కాయి. అందుకు కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌నా ద‌క్ష‌త అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ప‌రిపాల‌న‌లో జ‌గ‌న్ త‌ల‌పండిన నాయ‌కుడేం కాదు. అనుభవం కేవ‌లం రెండున్న‌రేళ్ల లోపే. కానీ.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాలంటే కావాల్సింది అనుభ‌వం కాదు.. మంచి చేయాల‌నే చిత్త‌శుద్ధి అని త‌న నిర్ణ‌యాల ద్వారా జ‌గ‌న్ నిరూపించారు. నిరూపిస్తున్నారు. మేనిఫెస్టోలోని 95 శాతం హామీల‌ను రెండేళ్ల‌లోనే పూర్తి చేశారు. ఆయ‌న చేసిన అభివృద్ధి ఒక ఎత్త‌యితే.. దాని ద్వారా ప్ర‌భుత్వానికి పెరుగుతున్న ఖ్యాతిని చూసి ఓర్వ‌లేక ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న దుష్ప్ర‌చారాల‌పై జ‌నం విసిగిపోతున్నారు. వాటిని ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని వ‌రుస ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే స్ప‌ష్టం అవుతోంది. ఏ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అన్ని జిల్లా పరిషత్‌లను దక్కించుకోవడం, ఒక‌టి, అరా మిన‌హా మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడం బ‌హుశా దేశంలోనే ఇదే ప్రథమం అని చెప్పొచ్చు.

Also Read:హెరాయిన్- ఆంధ్రప్రదేశ్ : బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతున్న ఓ వర్గం మీడియా

జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డ‌మే రికార్డుతో మొద‌లైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన‌భై ఆరు శాతం సీట్ల‌ను ఒక్క వైసీపీ కైవ‌సం చేసుకుంది. 175 స్థానాలు ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏకంగా 151 స్థానాలను జ‌గ‌న్ గెలిచారు. అది కూడా అత్య‌ధిక స్థానాల్లో బంప‌ర్ మెజార్టీల‌తో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌లు గెలిపించారు. ఆ ఫ‌లితాల‌ను చూసి ఖంగు తిన్న ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆ చరిత్రాత్మక విజయాన్ని తక్కువ చేయటానికి ఎన్నో వక్రభాష్యాలు ప‌లికారు. వారి ప‌నికిమాలిన విమ‌ర్శ‌ల‌కు, అర్థం ప‌ర్ధం లేని ఆరోప‌ణ‌ల‌కు స్పందించి స‌మ‌యం వృథా చేసుకోకుండా జ‌గ‌న్ కేవ‌లం ప్ర‌జ‌ల సంక్షేమానికే అధికంగా దృష్టిని కేంద్రీక‌రించారు. ఫ‌లితంగా సంక్షేమ ర‌థం రాష్ట్రంలో దూసుకెళ్తోంది. ఆ ఫ‌లాలను అనుభ‌విస్తున్న ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు గుండెల్లో గుడి క‌ట్టేశారు. కొన్ని చోట్ల నిజంగా గుడి క‌ట్టారు.

ఆ అభిమానంతోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుదారులకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఏకంగా ఎన‌భై శాతానికిపైగా స్థానాలు ఆ పార్టీయే ద‌క్కించుకుంది. అయితే.. అవి పార్టీ గుర్తుల ర‌హితంగా జ‌రిగే ఎన్నికలు కావటంతో... వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుదారులు గెలిచిన సీట్ల‌ను త‌న ఖాతాలోనే వేసుకుని టీడీపీ ప్ర‌చారం చేసుకుంది. కొన్ని చోట్ల ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చింది. అయితే... ఆ త‌ర్వాత జ‌రిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ బ‌లం తేలిపోయింది. వంద‌కు వంద శాతం కార్పొరేష‌న్ల‌ను, 98.6 శాతం మున్సిపాలిటీల‌ను వైసీపీ సాధించుకుని రాజ‌కీయాల్లో స‌రికొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది.

Also Read: వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం

ఆ త‌ర్వాత జరిగిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే ఒర‌వ‌డి కొన‌సాగింది. ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన టీడీపీ ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కొత్త డ్రామాల‌కు తెర తీసింది. బ‌హిష్క‌ర‌ణ నాట‌కం మొద‌లుపెట్టింది. ప‌రోక్షంగా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. గెలిస్తే త‌మ ఖాతాలో.. ఓడిపోతే పోటీ చేయాల‌నే నెపంతో త‌ప్పించుకోవ‌చ్చ‌ని భావించింది. తిరుగులేని ఆధిక్యంతో 13 జిల్లా పరిషత్‌లను, 99.95 శాతం మండల పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ కైవ‌లం చేసుకుని విజయదుందుభి మోగించ‌డంతో ప్ర‌తిప‌క్షానికి క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. అభ్యర్థులను ఎంపిక చేసి.. బీ –ఫారాలు, డ‌బ్బులు ఇచ్చి ప్రచారం చేసి కూడా.. తాము ఎన్నికల్లో పోటీ చేయలేదని, బాయ్‌కాట్‌ చేశామని చెబుతున్న టీడీపీ నేత‌లు ఓ విష‌యానికి స‌మాధానం చెప్పాలి. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తే ఏడు జెడ్పీటీసీ స్థానాలు, దాదాపు 923 మంది టీడీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా ఎలా గెలిచారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఫ‌లానా చోట్ల టీడీపీ అభ్య‌ర్థులు గెలిచిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఒక్క‌టి మాత్రం నిజం.. ప్ర‌తి ఇంటికీ సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తున్న జ‌గ‌న్ చ‌ర్య‌లు వృథా కావ‌డం లేదు. వాటిపై ప్ర‌తిప‌క్షం ఎన్ని దుష్ప్ర‌చారాలు చేసినా జ‌గ‌న్ జైత్ర‌యాత్ర‌ను ఆప‌లేక‌పోతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ కుయుక్తులను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. ప‌ళ్లున్న చెట్ల‌కే రాళ్ల దెబ్బ‌ల‌ని ఓ సంద‌ర్భంలో జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. అందుకే ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అపూర్వ విజయాల్ని క‌ట్ట‌బెడుతున్నారు. ఐదేళ్ల‌లో మిగిలిన మ‌రో అర్థ‌భాగం కాలంలో జ‌గ‌న్ మ‌రింత దూకుడుగా ముందుకెళ్తార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. రెండున్న‌రేళ్ల అభివృద్ధికే ప్ర‌జ‌ల్లో వైసీపీ ఇంత బ‌లంగా పాతుకుపోతే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఇంకెంత రికార్డు సాధిస్తుందో అన్న ఉత్కంఠ అంత‌టా ఉంది.

Also Read: అఖాడా పరిషత్ మహంత్ నరేంద్ర గిరి,సహజ మరణమేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp