Idream media
Idream media
కరోనాకు మందు లేదు…వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి మరణంతో పోరాడుతున్న వ్యక్తుల చికిత్స కోసం వాడుతున్న పద్ధతి ప్లాస్మా థెరపీ. గత రెండు రోజుల క్రితం భారత్‌లో కూడా నలుగురు కరోనా బాధితులు ఈ చికిత్సా విధానం ద్వారా కోరుకున్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కానీ తాజాగా పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ఆరోగ్యశాఖ సంచలన ప్రకటన చేసింది.
ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధన జరుపుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు లేకుండా ప్రయోగిస్తే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఐసీఎంఆర్ అనుమతించే వరకు ఎవ్వరూ ఈ థెరపీని ఉపయోగించకూడదని, పైగా అలా చేయడం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్లాస్మా థెరపీని ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానానికి ముందుకు రావాలని కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా ప్రకటనతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి. కాగా గాంధీ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న ఏడుగురికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించడానికి ఇవాళ ఉదయం ఐసీఎంఆర్ అనుమతించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్మా థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 600 మందికి పైగా కరోనా బాధితులకు ఈ విధానం ద్వారా చికిత్స అందించారు. ఈ చికిత్సా విధానంపై అమెరికాలోని 1500లకు పైగా హాస్పటల్ ల తోడ్పాటుతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. అలాగే బ్రిటన్‌లోనూ కూడా శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.