Dharani
Dharani
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళ చదువుకుంటే.. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే.. ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు. ఆడవారు ఆర్థిక స్వాలంభన సాధిస్తే.. ఆ సమాజం కూడా అభివృద్ధి చెందినట్లే. కొందరు మహిళలకు పెద్దగా చదువు లేకపోయినా.. మంచి తెలివి తేటలు ఉంటాయి. చిన్నదో పెద్దదో వ్యాపారం చేసి తాము అభివృద్ధి చెందడమే కాక.. మరి కొందరికి ఉపాధి కల్పించానలని ఆశపడతారు. అయితే వ్యాపారం చేయడం అంటే మాటలు కాదు. చేతిలో ఏంతో కొంత నగదు తప్పకుండా ఉండాలి. కానీ పేద, మధ్యతరగతి వారి వద్ద.. ఒకే కాలంలో ఏకంగా లక్ష రూపాయలు నగదు ఉండటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. దాంతో చాలా మంది మహిళలు.. వ్యాపార ప్రయత్నాల వైపు ఆలోచించరు.
అదిగో అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న పథకం తీసుకువచ్చింది. చిన్న వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్న మహిళలకు వడ్డీ రహిత రుణాలను అందించే పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని కింద మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొంది.. 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు నెలకొల్పే అవకాశం కల్పించనుంది. మరి ఈ పథకం పేరు ఏంటి.. దీనికి ఎవరు అర్హులు, ఎలాంటి పత్రాలు కావాలి వంటి పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ కార్యక్రమ లక్ష్యాల్లో భాగంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అనేక పథకాలు తీసుకువచ్చింది. దీనిలో భాగంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే ఉద్యోగిని స్కీమ్. తొలుత ఈ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 48 వేల మంది మహిళలు లబ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
ఈ పథకం కింద 3 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. వైకల్యమున్న మహిళలు, వితంతువులకు రుణ పరిమితి లేదు. వారు నెలకొల్పే వ్యాపారం, వారి అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం కల్పిస్తారు.
ఉద్యోగిని స్కీమ్ కింద వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10 శాతం నుంచి 12 శాతం వడ్డీ మీద రుణం ఇస్తారు. ఈ వడ్డీ అనేది ఆ మహిళ రుణం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ఉంటుంది. అలాగే.. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం వరకూ సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉంది.
ఉద్యోగిని పథకం కింద రుణం పొందడానికి మహిళలు కేవలం తమ ప్రాంతంలోని బ్యాంకులను మాత్రమే సంప్రదించాలి. అలానే బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు కూడా ఉద్యోగిని స్కీమ్ కింద రుణాలు మంజూరు చేస్తున్నాయి.