Idream media
Idream media
నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రెండు నెలలుగా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. వర్షంలో తడిచారు. అర్థాకలితో గడిపారు. వీళ్లు రైతులేనా అంటూ చేసిన అవహేళనలను సహించారు. అవమానాలను దిగమింగారు. రెచ్చగొట్టినా శాంతియుతంగా నిలిచారు. 150 మంది అన్నదాతలు అశువులుబాసారు. కేసులు ఎదుర్కొన్నారు. అరాచక శక్తులు ట్రాక్టర్ ర్యాలీని ఉద్రిక్తతంగా మార్చినా.. అన్నదాతల పట్టుసడలలేదు. అయినా.. కేంద్ర ప్రభుత్వంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. అన్నదాతల ఆందోళలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నారు. నూతన సాగు చట్టాలను కొనసాగించేందుకే సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలలో.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంగించారు. మూడు సాగు చట్టాలను రైతుల మేలు కోసమే తీసుకొచ్చామని రాష్ట్రపతి సెలవిచ్చారు. రిపబ్లిక్‌డే రోజున ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలతో.. నూతన సాగు చట్టాలపై కేంద్రం ఎలాంటి వైఖరిని అవలింభిస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. రైతుల మేలు కోసమంటూ కరోనా కల్లోలంలో తూ తూ మంత్రంగా సాగిన పార్లమెంట్ సమావేశాల్లోనే నూతన సాగు చట్టాలను ఎందుకు తెచ్చారనే ప్రశ్నకు సమాధానం లేదు. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీల పరం చేస్తున్నారంటూ.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా ఇష్టముంటేనే కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవచ్చని.. చావు కబురును చల్లాగా చెబుతోంది. అందుకే ఈ చట్టాలు మాకు వద్దని రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.
మహిళ కంట కన్నీరు కుటుంబానికి, రైతు కంట కన్నీరు దేశానికి మంచిదికాదంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నదాతల ఆవేదనను పట్టించుకోవడం లేదు. పొలంలో ఉండాల్సిన రైతన్న రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటున్నా.. ఎందుకు ఖాతరు చేయడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు అన్ని వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మద్ధతునిచ్చాయి. ఈ ఒక్క ఘటనతో దేశం మొత్తం రైతుల డిమాండ్‌కు వెన్నుదన్నుగా నిలిచిందని స్పష్టమైంది. ప్రజా స్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు.. వారి ప్రయోజనాలను కాపాడాలంటారు. కానీ సాగు చట్టాల విషయంలో భిన్నంగా సాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే కార్పొరేట్ల పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్న అన్నదాతలు.. సాగు చట్టాల విషయంలో కేంద్ర పెద్దలు ఏమి చెప్పినా.. నమ్మే పరిస్థితిలో అన్నదాతలు లేరని స్పష్టమవుతోంది. పూర్తి మెజారిటీ ఉందని ఏమి చేసినా చెల్లుతుందనే ధోరణిలో ఉంటే.. భవిష్యత్‌లో కమలం పార్టీకి ఇబ్బందులు తప్పవు. రైతుల ఉద్యమానికి ముగింపునిచ్చేలా.. సాగు చట్టాలపై సరైన నిర్ణయం తీసుకోవడం ఉభయపక్షాలకు, దేశానికి మంచిది.