iDreamPost
iDreamPost
“రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను అమరావతి తెచ్చాను. నన్ను చూసి రైతులు భూములిచ్చారు..” ఇదీ చంద్రబాబు మాట. మళ్లీ అంతలోనే “రైతులు భూములిచ్చింది..చంద్రబాబుకి కాదు. ప్రభుత్వానికి ఇచ్చారు. నామీద కక్షతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు..” ఈ రెండూ ఒకే సభలో. కొన్ని నిమిషాల వ్యవధిలోనే.
“విశాఖని నేనే అభివృద్ధి చేశా.. నేను విశాఖకి వ్యతిరేకం కాదు..” ఇది కూడా చంద్రబాబు మాటలే. మళ్లీ కొన్ని సెకన్లకే “అమరావతిని చంపేయాలని చూస్తున్నారు. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. జై అమరావతి..” ఇది కూడా చంద్రబాబు మాటలే. ఒకే సభలో చేస్తున్న వ్యాఖ్యలే.
“పైసా ఖర్చు లేకుండా అమరావతి నిర్మించడానికి సిద్ధపడ్డాం. హైదరాబాద్ తరహాలో అంతర్జాతీయ నగరాన్ని నిర్మించడానికి నా అనుభవంతో ప్రారంభించాను..” ఈ మాటలు కూడా చంద్రబాబు చెప్పినవే. మళ్లీ కొన్ని నిమిషాలకే “అమరావతికి 9వేల కోట్లు ఖర్చు చేశాం. ముగిసిపోయిన సమస్య అమరావతిని మళ్లీ మొదటికి తెస్తున్నారు..” ఈ కామెంట్స్ కూడా ఆయనవే.
అంటే పైసా ఖర్చు లేదంటారు. తన ప్రభుత్వం 9వేల కోట్లు ఖర్చు చేసిందంటారు. విశాఖకి వ్యతిరేకం కాదంటారు. జై అమరావతి అని నినదిస్తారు. రాజధాని అక్కడే ఉండాలంటున్న వారికి సంఘీభావం తెలుపుతారు. తనను నమ్మి ల్యాండ్ ఫూలింగ్ లో రైతులు భూములిచ్చారంటారు. భూములు తనకు కాదు..ప్రభుత్వానికి ఇచ్చారని కూడా ఆయన చెబుతుంటారు. ఇలా ఒకే సభలో ఆయన ఇన్ని రకాలుగా మాట మారుస్తున్న వైనం వినేవాళ్లకు విస్మయకరంగా ఉంటుంది. కానీ ఆయనకు మాత్రం ఎటువంటి తొత్తరపాటు కనిపించదు. ముఖ్యమంత్రి జగన్ అంటున్నట్టుగా కళ్లు తెరిచి మరీ అబద్ధాలను చెప్పడానికి ఆయన సంకోచించరని స్పష్టం అవుతోంది.
తెలుగుదేశం పార్టీలో సందిగ్ధ స్థితికి చంద్రబాబు వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి. అమరావతి విషయంలో ముందుకి వెళ్లలేక, వెనక్కి రాలేక మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాజధాని రైతులకు సంఘీభావంగా చంద్రబాబు రావాలని తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆయన మానసికంగా సంఘర్షణకు గురయినట్టు కనిపిస్తోంది. చివరకు నారా లోకేష్ సహా పలువురు నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన అనివార్యంగా అమరావతిలో అడుగుపెట్టారు. నెల రోజులు కూడా గడవకముందే ఆయన రెండోసారి రాజధాని ప్రాంతంలో ఆందోళనలో పాల్గొన్నారు.
అయినప్పటికీ చంద్రబాబుకి మాత్రం తన రాజకీయ విధానంలో స్పష్టత కనిపించడలేదనడానికి పైన ప్రస్తావించిన అంశాలు ఆధారంగా చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమావేశంలో అచ్చెన్నాయుడు అమరావతి అంటే కోండ్రు మురళీమోహన్ సహా పలువురు నేతలు జై విశాఖ అనడంతో చివరకు ఎటువంటి తీర్మానం చేయకుండానే ప్రతిపక్ష పార్టీ సమావేశం ముగిసిపోయిన తీరు తెలుగుతమ్ముళ్ళు తలోదిక్కు ఉన్నారనడానికి తార్కాణంగా చెప్పవచ్చు. అధినేతలోనే ఇంత గందరగోళం ఉంటే దిగువస్థాయి నేతల్లో క్లారిటీ కష్టమే అన్నది మరోసారి రుజువయ్యింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఆ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమిటన్నది కూడా టీడీపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఇంత ప్రయాసపడినా పార్టీకి మేలు జరిగే అవకాశం లేనందున జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు. అయినప్పటికీ చినబాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టడమే తప్ప కలిగే లాభం కనిపించడం లేదన్నది చంద్రబాబు స్వరంలో వినిపిస్తున్న వేరియేషన్స్ చాటుతున్నాయి.