iDreamPost
iDreamPost
చంద్రబాబు మరోసారి పేలవంగా ప్రతిస్పందించారు. కీలక విషయంలో ఆయన స్పందన చివరకు పార్టీ శ్రేణులకు కూడా మింగుడుపడేలా లేదు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నేటికీ తన తొలినాళ్ల నాటి రాజకీయ ఎత్తుగడలు వేయడానికి సిద్ధపడడం విస్మయకరంగా మారింది. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యన్నారాయణ పాత్రను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిర్ధారించారు. పైగా దానికి ఆధారాలుగా ఉన్న ఆయా మంత్రుల లేఖలను కూడా బహిరంగపరిచారు. దాంతో కుంభకోణం విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన చంద్రబాబు దానికి భిన్నంగా కులం కోణం ఆశ్రయించారు. బీసీలను అణచివేస్తున్నారనే వాదన చేయడం ద్వారా ఆయన తీరు ఆశ్చర్యంగా మారింది.
కుంభకోణంలో తన పాత్రపై అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవినీతి జరగలేదని చివరకు ఆయన కూడా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించామని, తెలంగాణా ప్రభుత్వం తరహాలోనే వ్యవహరించామని మాత్రమే ఆయన చెప్పారు. తద్వారా కుంభకోణం వాస్తవమేనని మాజీ మంత్రి అంగీకరించినట్టయ్యింది. కానీ చంద్రబాబు దానిని బీసీలను అణచివేసే చర్యకు చిత్రీకరించ పూనుకోవడం విస్మయకరంగా మారింది. 900 కోట్ల వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో నిరూపించాలని, విచారణ సమగ్రంగా జరిపించాలని డిమాండ్ చేసి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకి తగ్గట్టుగా వ్యవహరించినట్టవుతుంది. వాస్తవంగా ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తే విపక్షం దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పాలకపక్షం దూకుడుగానూ, ప్రతిపక్షం దోషిగానూ కనిపిస్తుండడం విశేషం. అవినీతి విషయంలో వ్యవహారం తారుమారు కావడంతో చంద్రబాబు చివరకు ఊపిరిసలపని స్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంతా భావించే పరిస్థితి వచ్చింది.
పైగా మండలిలో ముస్లీంలు ఉన్నారు కాబట్టి రద్దు చేశారని, అచ్చెన్న, పితాని బీసీలు కాబట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రకటన విడుదల చేయడం పూర్తి ఆత్మరక్షణ స్థితిని చాటుతోంది. ఓవైపు చంద్రబాబు సంబంధీకులపై ఐటీ దాడులు, అదే సమయంలో ఏపీలో గత ప్రభుత్వ హయంలో జరిగిన వ్యవహారాలు వెలుగు చూస్తుండడంతో టీడీపీ పూర్తిగా తల్లడిల్లిపోతున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. అధికార పక్షం ఇప్పటికే పలు విషయాలను బహిరంగపరిచినప్పటికీ ఒక్క కేసు కూడా సంపూర్ణ దర్యాప్తు సాగిన దాఖలాలు కనిపించడం లేదు. రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ సహా అనేక అంశాల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కానీ ఈఎస్ఐ కుంభకోణం ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ నిర్ధారణ జరగడం, కేంద్రంతో ముడిపడిన వ్యవహారం కావడంతో విచారణ వేగవంతం చేసి, అసలు దోషులను బయటపెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు స్పందన చూసి రాజకీయ పరిశీలకులు కూడా జాలిపడే పరిస్థితి వస్తోంది.