Idream media
Idream media
మరో 17 రోజుల్లో తెలుగుదేశం పార్టీ 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. రాజకీయంగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు తెలుగుదేశం. అలాంటి పార్టీ ఇప్పుడు రాజకీయంగా అత్యంత పతనావస్థకు చేరుకుంది. 2019 ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమయ్యింది. ఎన్నికల తర్వాత రోజుకొక నాయకుడు సైకిల్ దిగిపోతుండడంతో అధినేత చంద్రబాబు నాయుడుకు దిక్కు తోచడం లేదు. మరీ ముఖ్యంగా పార్టీ పుట్టినప్పటి నుంచి వీర విధేయులుగా ఉన్న వారు సైతం చంద్రబాబును, టీడీపీని వీడుతుండడం ఆ పార్టీ గడ్డు పరిస్థితికి నిదర్శనం.
టీడీపీ నేటి దుస్థితికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు అహంకార పూరితంగా వ్యవహరించిన తీరే కారణం విశ్లేషకుల అభిప్రాయం. ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారన్నది నానుడి. అధికారం అండగా చెలరేగిపోయి ఎన్నో అక్రమాలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారు కుల, మత, ప్రాంత, బంధుప్రీతి లేకుండా పనిచేయాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారు. ఇదే ప్రజలకు విరక్తి కలిగించింది. అందుకే చిత్తుగా ఓడించారు. చంద్రబాబు వ్యవహార శైలి ఆ పార్టీ నాయకులకూ విసుగు తెప్పించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు. అధికారం పోయిన తర్వాత కూడా చంద్రబాబు నైజంలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రజలకు జగన్ ప్రభుత్వం చేసే మంచి విషయాలలో కూడా చంద్రబాబు పెడార్థాలు తీయడం చాలా మంది టీడీపీ నాయకులకు రుచించలేదు. ఇంగ్లిష్ మీడియం, మూడు రాజధానులు.. ఇలా పేదలకు, రాష్ట్రానికి మేలు జరిగే విషయాలను తప్పుపట్టడం, కృత్తిమ ఉద్యమాలు చేయించడం ఎవరికీ నచ్చలేదు.దీనికి తోడు టీడీపీ భవిషత్తు మీద నేతలకు ఆశలు లేకపోవటం అన్ని కలిసి జిల్లాల్లో సైకిల్ తొక్కీ తొక్కీ అలసిన నాయకులు ఆ పార్టీకి బై బై చెబుతున్నారు. ఫ్యాన్ గాలిలో సేద తీరడానికి క్యూ కడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మొదలైన రాజీనామాల పర్వం నిర్విరామంగా కొనుసాగుతూ వస్తోంది. ఆ తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు పార్టీని వీడారు. తాజాగా ప్రకాశం జిల్లాలోనే బలమైన నేతగా పేరుగాంచిన కరణం బలరాం కూడా టీడీపీని వీడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కరణం బలరాం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ మానసికంగా వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు.
ఉన్న 23 మందిలో ఇలా ముగ్గురు పార్టీని వీడడంతో చంద్రబాబు గురువారం ఉన్నఫళంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, బాలవీరాంజనేయ స్వామి తదితరులను పిలుపించుకొని మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లొద్దని బ్రతిమిలాడినట్లు సమాచారం.వీరిలో బాలవీరాంజనేయ స్వామీ పార్టీ మారటం ఖాయం అని ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతుంది.
మరోవైపు గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంటున్నారు.వైఎస్సార్‌సీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే మంత్రి అవంతి అడ్డుకోవడంతో ఆగిపోయింది. రేపోమాపో అన్నట్లు పరిస్థితి ఉంది. మండపేట, పాలకొల్లు ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు కూడా పార్టీ నుంచి జంప్ కావడానికి చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్లు మినహా ఎవరూ పార్టీలో మిగిలే పరిస్థితి లేదని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో బలం లేకపోయినా రాజ్యసభకు వర్ల రామయ్యను ప్రకటించారు. నేటితో (శుక్రవారం) గడువు ముగియనుండగా ఇంత వరకు నామినేషన్ వేయకపోవడం గమనార్హం. చివరి నిమిషంలో పార్టీ ఎమ్మెల్యేలు చేయిస్తే.. పార్టీ పరువు పూర్తిగా పోతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే వైఎస్సార్ జిల్లాలో 37 ఏళ్లుగా పార్టీ జెండా మోసింది కేవలం పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబం. వాళ్ల బాబాయి శివారెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. అలాంటిది రామసుబ్బారెడ్డి టీడీపీని వీడడం నిజంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఆయన ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరారు.
విశాఖను రాజధానిగా ప్రకటించగానే చంద్రబాబు వ్యతిరేకించడంతో అక్కడ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్‌కు గుడ్‌బై చెబుతున్నారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, రెహ్మాన్ వైఎస్సార్‌సీపీలో చేరారు. నెల్లూరులో బీద మస్తాన్‌రావు, ప్రకాశం జిల్లాలో పోతుల దంపతులు, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. తూర్పుగోదావరిలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పాటు గుంటూరు నుంచి డొక్కా మాణిక్యప్రసాద్, కృష్ణా నుంచి దేవినేని అవినాశ్, వైజాగ్‌లో పంచకర్ల రమేశ్‌బాబు, పులివెందులలో సతీశ్‌రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
గతంలోనూ ఎన్నోసార్లు సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో నాయకులు పార్టీని వీడడం ఇదే మొదటిసారి. జిల్లాలు జిల్లాలే ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఎవరూ మిగిలే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.