iDreamPost
android-app
ios-app

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ.. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లకుండా ఉంటారా..?

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ.. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లకుండా ఉంటారా..?

ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమాలను నిగ్గు తేల్చే పనిని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదికతోపాటు సీఐడీ ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, నమోదు చేసిన కేసులను సీబీఐకి అప్పగించింది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దాని పరిసర ప్రాంతాల్లో టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. మంత్రివర్గ ఉప సంఘం సేకరించిన వివరాల మేరకే ఈ మొత్తం 4,070 ఎకరాలుగా తేలింది. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి, దాన్ని రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చారు. ఇది కాకుండా సీఆర్‌డీఏకు అనుకుని ఉన్న గ్రామాల్లోనూ వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. దళితులకు ఇచ్చిన అసైడ్‌మెంట్‌ భూములను కూడా కొనుగోలు చేసి ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చారు.

ఈ వ్యవహారం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అంటే.. 2015లోనే బయటకు పొక్కింది. అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. అయితే కొంటే తప్పేంటి అంటూ అప్పటి సీఎం, ఇప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎదురు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి ఉండడంతో ఆప్పట్లో ఆ విషయం మరుగునపడిపోయింది. రాష్ట్రంలో అధికారం మారడం, మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి రావడంతో మళ్లీ అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కథ మొదలైంది.

అక్రమాలపై దర్యాప్తు చేయించాలని మంత్రివర్గం, అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తీర్మానాల మేరకు తాజాగా అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారాన్ని తేల్చే పనిని సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని టీడీపీ నేతలు చెప్పారు. నిరూపించాలని సవాళ్లు కూడా విసిరారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా విచారణపై స్టే ఇవ్వాలంటూ ఇప్పటికే ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్రలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఈ విషయం సీబీఐకి చేరడంతో.. విచారణ జరగకుండా స్టే కోసం టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లకుండా ఉంటారా..? అనేది సందేహమే. అక్రమాలపై సీబీఐ విచారణ జరుగుతుందా..? లేక విచారణ జరపాలా…? వద్దా..? అనే అంశంపై కోర్టులో వాజ్యాలు జరుగుతాయా..? అనేది వేచి చూడాలి.