iDreamPost
android-app
ios-app

HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు!.. కారణం ఏంటంటే?

HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు!.. కారణం ఏంటంటే?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై పోలీస్ కేసు నమోదైంది. హెచ్ సీఏలో కొంత కాలం నుంచి వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జస్టిస్ లావు నాగేశ్వర రావు కమిటీ అజారుద్దీన్ కు షాకిచ్చింది. ఏకంగా హెచ్ సీఏ ఓటర్ల జాబితా అజారుద్దీన్ పేరును తొలగించింది. దీంతో రానున్న ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ పై కేసు నమోదవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అజారుద్దీన్ పై పోలీస్ కేసు ఎందుకు నమోదైంది అంటే?

ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందంటూ ఉప్పల్ పీఎస్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీనిపై హెచ్ సీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సునీల్ కంటే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక, క్రికెట్ బంతులు, కుర్చీలు, జిమ్ సామాగ్రి కొనుగోలు వ్యవహారంలో ఈ అవకతవకలు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగు చూసినట్లు సమాచారం. 2019-2022 మధ్య అపెక్స్ కౌన్సిల్ ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆ సమయంలో హెచ్ సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్నారు. అజారుద్దీన్ పాలక వర్గంలోనే హెచ్ సీఏలో నిధులు గోల్ మాల్ అయినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోళ్ల కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానంద్ లపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా త్వరలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరుగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి