Idream media
Idream media
గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఒక పెళ్లి జరిగింది. దాదాపు నెలరోజుల క్రితమే ప్లానింగ్ జరిగింది. వెయ్యి మంది వస్తారని అంచనా. క్యాటరింగ్ వాళ్లకి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కార్డులు పంచి అందరిని పిలిచారు. పిడుగులా కరోనా వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని స్థితి. పిలిచిన వాళ్లంతా వస్తే? ఎంతో ఇష్టంగా పిలిచిన వాళ్లనే, సున్నితంగా రావద్దని అన్నారు. దగ్గరి బంధువులంతా లెక్కేస్తే 300 మంది తేలారు. 350 మందికి భోజనాలు సిద్ధం చేశారు.
తీరా 150 మంది వచ్చారు. వచ్చిన వాళ్లంతా ఆశీర్వదిస్తుంటే కూడా భయం. ఒక్కరికి కరోనా ఉన్నా వధూవరులు క్వారంటైన్‌కి వెళ్లాల్సిందే. ఎలాగో హడావుడిగా అయిపోయింది. ఆదివారం వంద మంది లోపు దావత్ ప్లాన్ చేశారు. ఫంక్షన్ హాల్‌కి డబ్బులు కూడా ముందే ఇచ్చారు.
ఈలోగా మోడీ టీవీలో కనిపించి జనతా కర్ఫ్యూ అన్నాడు. దావత్ జరిగేది ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నారు. ఫంక్షన్‌హాల్ వాడు చేతులెత్తేశాడు. అధికారులకి తెలిస్తే సీజ్ చేసేస్తారు. మీ దావత్ మీ ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. కరోనా దెబ్బకి బంధువులు మేం రాలేమని చెప్పారు. మన ఆరోగ్యం కోసం గవర్నమెంట్ పిలుపిస్తే , మనం దావత్ చేసుకోవడం కరెక్ట్ కాదు. పొరపాటున కరోనా వస్తే అందరూ కలిసి సోషల్ బీయ్‌కాట్ చేస్తారని చెప్పారు. దావత్ ఆగిపోయింది. ఎవరిళ్లలో వాళ్లు.
నెలరోజుల క్రితం దావత్‌లో చికెన్ బిరియాని, మటన్ బిరియాని ప్లాన్ చేశారు. చికెన్ అంటేనే జనం పారిపోతున్నారు. అయినా చైనాలో ఉన్న కరోనా మన పెళ్లి చెడగొడుతుందని ఎవరికి తెలుసు?