iDreamPost
android-app
ios-app

కనీవినీ ఎరుగని స్థితిలో మహానాడు, టీడీపీ కి పునరుత్తేజం ఇక కలేనా?

  • Published May 27, 2020 | 3:06 AM Updated Updated May 27, 2020 | 3:06 AM
కనీవినీ ఎరుగని స్థితిలో మహానాడు, టీడీపీ కి పునరుత్తేజం ఇక కలేనా?

మహానాడు అంటే ఓ పండుగ. టీడీపీ శ్రేణులకు పెద్ద పండుగ. కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలరా అనగానే ఉప్పొంగే ఉత్సాహం.. ఉరకలెత్తే ఆనందం. ఇదంతా ఒకనాటి వైభోగం. వర్తమానం నిండా నిర్వేదం.. నిరాశ.. నమ్మకం కోల్పోయిన నాయకత్వం తో నానాటికీ తీసికట్టు గా మారుతున్న నైరాశ్యం. తెలుగుదేశం చరిత్రలోనే అత్యంత గడ్డు స్థితిలో ప్రస్తుతం మహానాడు మొదలవుతుంది. అదే సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగాను, నాయకుడిగాను, పార్టీ పరంగానూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న దశలో మహానాడు జరుగుతోంది. దాంతో గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్న చందంగా కనిపిస్తోంది.

చంద్రబాబు ఏడు పదుల వయసు దాటిపోయారు. ఎన్టీఆర్ ని టీడీపీ సారధ్య బాధ్యతల నుంచి తప్పించడానికి అప్పట్లో వయసు కూడా కారణం గా చూపించారు. పార్టీకి యువరక్తం అవసరం ఉందని వాదించారు. ఆ లెక్కన ఇప్పుడు బాబు వైదొలగాల్సి ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. తనయుడు నారా లోకేష్ ని తన తర్వాత నాయకుడు అని ఆశిస్తే వాస్తవం అందుకు విరుద్దంగా ఉంది. లోకేష్ ని అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఎంతగా వారసుడిని ఎగదోసినా చినబాబు చతికిల పడిపోవడం తో బాబు డీలా పడిపోయారు. టీడీపీ తోపాటుగా చంద్రబాబు కి వ్యక్తిగతంగా చిక్కులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాకు గండం పొంచి ఉంది. అధికారంలో ఉన్న సమయంలో విపక్ష ఎమ్మెల్యేలను ఎడాపెడా చేర్చుకుని విర్రవీగిన పుణ్యన ఇప్పుడు ఇక్కట్లు వచ్చి పడుతున్నాయు. దాంతో తన స్థానం కోల్పోవాల్సి వస్తుందనే కలవరం టీడీపీ అధినేతలో కనిపిస్తోంది. చివరకు అయినవాళ్ళని, కాని వాళ్ళని కాకా పట్టాల్సి వస్తోంది. ఒకనాడు తాను శాసించిన ఎమ్మెల్యేలను ఇప్పుడు శాంతింప జేయడానికి శతవిధాలా ప్రయత్నించాల్సి వస్తోంది. అయినా ఎమ్మెల్యేలు అందరూ తనవైపు నిలబడతారు అనే ధీమా లేదు. ఇంకా చెప్పాలంటే వైస్రాయ్ ఉదంతంలో ఎన్టీఆర్ అనుభవించిన క్షోభ ఇప్పుడు బాబుని వెబ్టాడుతున్నట్టు కొందరు భావిస్తున్నారు.

వ్యక్తిగతంగా తన స్థాయి మరింతగా కుచించుకు పోబోతున్న దశలో పార్టీగానూ పరిస్థితి సక్రమంగా లేకపోవడం మరో చిక్కు. సుమారు రెండు నెలలు పైబడి ప్రజలకు దూరంగా ఉన్న సమయంలో టీడీపీ ని నడిపించే వారే కనిపించలేదు. అధికారంలో ఉన్నంత కాలం బాబు వెంట ఉండి పలు రకాలుగా లబ్ది పొందిన నేతలు కూడా మొఖం చాటేస్తున్నారు. చివరకు వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, పట్టాభి వంటి పట్టుమని పది ఓట్లు, పక్కాగా ఓ నియోజకవర్గం లో పట్టు లేని నేతలతో కాలం నెట్టుకు రావాల్సి వస్తోంది. టీడీపీ నాయకత్వం విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. బాబు తర్వాత చినబాబూ సరిపొడని యంత్రాంగం యావత్తు భావిస్తోంది. చివరకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హోదాలో కూడా లోకేష్ ప్రభావం చూపలేక పోయారని అంతా భావిస్తున్నారు. దాంతో బాబుకి పెద్ద తలనొప్పి తప్పడం లేదు. ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయులు నుంచి తాను పార్టీని స్వాధీనం చేసుకున్న చందంగా తన తర్వాత తన వారసుడి స్థానంలో వేరొకరు సారధి కావాల్సి వస్తుందనే సందేహం బాబుని వెంటాడుతోంది.

అన్నింటికీ మించి చంద్రబాబు మీద ప్రజల్లో సానుకూలత పూర్తిగా సన్నగిల్లిపోతుంది. మొన్నటి ఎన్నికల్లోనే అస్త్రశస్త్రాలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకొని కారణంగా ఏడాది వ్యవధిలోనే అంతా తారుమారు అవుతోంది. లీడర్లు, క్యాడర్ కూడా బాబుకి బై బై చెబుతున్నారు. ఇది టీడీపీ పునాదులు కదిలిస్తోందా అనే అభిప్రాయం బలపడుతుంది ఇప్పటికే సామాజికంగా టీడీపీ కి వెన్నుదన్నుగా నిలిచిన బిసి లు వైసీపీ వైపు చేరిపోయారు. ఎస్సి, మైనార్టీ, ఎస్టీ లలో టీడీపీ కి చోటు లేదనే చెప్పవచ్చు. ఇక మిగిలిన కాపు సామాజిక వర్గానికి పవన్ పేరుతో వల వేయవచ్చని ఆశిస్తున్నా అది కలగానే మిగిలేలా ఉంది. అన్నీ కలిసి పార్టీ భవిష్యత్తు మీద విశ్వాసం లేకుండా చేస్తున్నాయి. దాన్ని గ్రహించిన అనేకమంది ఇప్పటికే కండువాలు మార్చేస్తున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో టీడీపీ పేలవమైన పరిస్థితి బట్టబయలు అయ్యింది. ఎన్నికలు వాయిదా కొంత ఊపిరి పోసింది గానీ లేకుంటే గత సాధారణ ఎన్నికల తర్వాత మహానాడు జరువుకోలేని స్థితికి చేరినట్టే, ఇప్పుడు కూడా అయిపోయేది. అయినా ఏదో అట్టహాసంగా అధిష్టానం హడావిడి చేస్తున్నా క్షేత్రస్థాయిలో టీడీపీ కి కష్టాలు రెట్టింపు అవుతున్న వేళలో మహానాడు విశేషం గానే చెప్పవచ్చు. జూమ్ చేసినా కోలుకునే ఆవకాశం స్వల్పమే అనవచ్చు.