iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు జరుగుతుంది అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో రాజ్యాంగ పరంగా శాసనమండలి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వ హక్కులు గురించి తెలుసుకోవాలి.
మండలి విచక్షణ ఏది?
భారత రాజ్యాంగం ప్రకారం శాసనమండలి ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక రాష్ట్రం శాసనమండలిని ఏర్పాటు చేస్కొదలిస్తే కేంద్రం ఆ నిర్ణయాన్ని గౌరవించి మండలి ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 లో పొందుపరచిన ప్రకారం, రాష్ట్రము కోరుకున్న శాసన మండలి ఏర్పాటును కేంద్రం అడ్డుకోకూడదు.
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న శాసన మండలిని రద్దు చేయదలిస్తే కేంద్రం ఆ విజ్ఞప్తిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలి. 169 C లో చెప్పినట్లు “Center may pursuit by law”. దీన్ని డిక్షనరీ అర్థంలో కాకుండా రాజ్యాంగ స్పూర్తితో అర్ధం చేసుకుంటే మండలి ఏర్పాటు రాష్ట్ర హక్కు అయినప్పుడు మండలి రద్దు కూడా రాష్ట్ర హక్కు అవుతుంది.
రాజ్యాంగంలో ఉన్న అంశాల మీద అనేక సందర్భాల్లో రకరకాల నిర్వచనాలు, కోర్టు తీర్పులు అన్వయించడం చూసిన తర్వాత అర్ధం కన్నా స్ఫూర్తికే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం నిజంగా శాసనమండలి రద్దు చేయదలిస్తే కేంద్రం దాన్ని అడ్డుకోజాలదు. రాజ్యాంగంలోని నిర్వచనాల ప్రకారం కూడా మండలి ఏర్పాటుకు , రద్దుకు కారణాలు కూడా చెప్పవలసిన అవసరం లేదు. అసలు శాసనమండలి లేకుంటే శాసనసభ ఆమోదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఈ పాటికి గవర్నర్ దగ్గరకు చేరేది. అందుకే శాసనమండలి రాజకీయ లక్ష్యాల కోసం పనిచేయకూడదు .
రెండు సభల ఉమ్మడి సమావేశం రాజ్యాంగ విరుద్ధమా ?
రాజ్యాంగంలో లోక్ సభ, రాజ్యసభల ఉమ్మడి సమావేశం గురించి ప్రస్తావించినట్లు శాసనసభ శాసనమండలి ఉమ్మడి సమావేశం గురించి ప్రస్తావన లేదు. దీని అర్ధం శాసనమండలి, శాసన సభల ఉమ్మడి సమావేశం జరపకూడదని కాదు. శాసనమండలి రాష్ట్ర హక్కు. అన్ని రాష్ట్రాల్లో శాసనమండళ్ళు ఏర్పాటు ఆ రాష్ట్ర నిర్ణయం కాబట్టి దీని మీద రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన ఉండి ఉండకపోవచ్చు.
రాజ్యంగంలో శాసనసభ , శాసనమండలి ఉభయ సమావేశ ప్రస్తావన లేకపోయినా గవర్నర్ ప్రసంగము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో జరుగుతుంది. శాసనమండలి వరకు మనం రాజ్యాంగ స్ఫూర్తిని మాత్రమే అర్ధం చేసుకోవాలి. రాజ్యాంగం నిర్వచనం ప్రకారం కూడా శాసనసభ చేసిన ఏ నిర్ణయాన్ని శాసనమండలి అడ్డుకోలేదు. బిల్లులను తిరస్కరించడం ద్వారా కొంత కాలయాపన మాత్రమే చేయగలుగుతుంది. రూల్ 71 అయినా మరొకటి అయినా, శాసనమండలికి లేని అధికారాన్ని ఎక్కడి నుండి తీసుకువస్తుంది?
పెద్దల సభ గా పిలవబడే శాసనమండలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును రాజకీయ లక్ష్యాలతో అడ్డుకోవడం మండలి ఏర్పాటు లక్ష్యాలకే విరుద్ధం. ప్రజా తీర్పు ద్వారా ఏర్పడ్డ శాసనసభ చేసిన బిల్లును మరింత ఉపయోగకరంగా మార్చడానికి శాసనమండలి ఉపయోగపడాలి కానీ శాసనసభ నిర్ణయాన్ని తిరస్కరించడానికి కాదు.
ఉమ్మడి సమావేశానికి గవర్నర్ అంగీకరిస్తే ఏ కోర్టు దాన్ని అడ్డుకోలేదు. శాసనమండలి, శాసన సభల ఉమ్మడి సమావేశానికి గవర్నర్ దే తుది నిర్ణయం.
ప్రభుత్వ సంసిద్ధత ఏది?
రాజధాని వికేంద్రీకరణ లాంటి ప్రతిష్టాత్మక బిల్లును తమకు బలం లేని శాసనమండలిలో ప్రవేశ పెట్టేటప్పుడు తగిన కసరత్తును ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా విపక్ష టీడీపీ ఆధిపత్యం ఉన్న శాసనమండలిలో బిల్లు పాస్ చేయించుకోవడానికి ప్రభుత్వం తరపున మంత్రులు టీడీపీ,పీడీఎఫ్, బీజేపీ సభ్యులతో ముందుగా చర్చించి సహకరించమని కొరవలసింది. కనీసం టీడీపీయేతర సభ్యుల మద్దతు బిల్లుకు సాధించా వలసింది. ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమలో ఆ ప్రాంత నాయకుల ద్వారా విపక్షం నుండి ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల మీద ఒత్తిడి పెంచవలసింది.
ఇలాంటి సందర్భాలలో విపక్ష సభ్యుల మద్దతు కూడగట్టడానికి వెంకయ్య నాయుడు, గులాం నబి ఆజాద్ లు ఎలా వ్యవహరించేవారో తెలుసుకోవాలి. ప్రతీ సమస్యకు రాజకీయ పరిష్కారమే కాకుండా చర్చల ద్వారా కూడా పరిష్కారానికి ప్రయత్నం చేయాలి.