iDreamPost
iDreamPost
పౌరసత్వం చట్ట సవరణ విషయంలో ప్రజల్లో అపోహలు అలజడి రేపుతున్నాయి. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశమంతా దద్దరిల్లుతోంది. అలాంటి సమయంలో పాలకులు ప్రతిపక్షాల మీద విరుచుకుపడే ప్రయత్నం పెద్దగా ఫలించే అవకాశం లేదు. తప్పిదాన్ని విపక్షాల మీదకు నెట్టాలని చూడడం అన్ని వేళలా ఉపయోగపడదు. అయినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అదే ప్రయత్నం చేశారు. అయినా ప్రజల్లో అగ్రహం చల్లారకపోవడంతో చివరకు ప్రధానమంత్రి ఢిల్లీ వేదికగా ప్రకటన చేస్తూ ఎన్నార్సీ గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదని పేర్కొన్నారు.
ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని కీలక నేతల తీరు మీద మరిన్ని అనుమానాలకు కారణం అవుతోంది. నిజాయితీగా తమ నిర్ణయం విషయంలో ప్రకటన చేయాల్సిన సమయంలో ప్రధానమంత్రి అలా చెప్పడమే విస్మయకరంగా మారింది. స్వయంగా పార్లమెంట్ వేదికగా కేంద్రంలో నెంబర్ టూ గా ఉన్న అమిత్ షా ప్రకటన చేసి ఇంకా రెండు వారాలు కూడా కాలేదు. ఆయన మాటలను ఇంకా జనం మరచిపోలేదు. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఎన్నార్సీ గురించి ఆయన సుస్పష్టంగా ప్రకటించారు. త్వరలోనే అది పూర్తి చేస్తామని వెల్లడించారు. కానీ దానిని విస్మరించిన ప్రధాని మోదీ మాత్రం షా మాటలకు పూర్తి విరుద్ధంగా మాట్లాడడం బీజేపీ శ్రేణులకు సైతం మింగుడుపడడం లేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ మోదీ చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్న విషయం పార్లమెంట్ లో అమిత్ షా మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒకవేళ మోదీ చెప్పింది నిజమయితే పార్లమెంట్ లో అమిత్ షా వాస్తవ విరుద్ధమైన అంశం చెప్పినట్టవుతుంది. దాంతో ఈ ఇద్దరిలో ఎవరిది అబద్ధం అంటూ ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. దేశాన్ని పాలిస్తూ అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలు ఇంత బాహాటంగా అబద్ధాలు వల్లిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో మోదీ అభిమానులకు కూడా దీనిని ఎలా సమర్థించాలన్నది అర్థంకాని అంశంగా మారింది.
దేశ ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ లో ప్రభుత్వం తరుపున చేసిన ప్రకటనలకు భిన్నంగా అదే ఢిల్లీ నుంచి విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో ఇప్పటికే ఆందోళనతో ఉన్న వారిలో మరింత కలవరం కలుగుతోంది. అసోంలో డిటెన్షన్ సెంటర్ల విషయంలో కూడా ప్రధాని మాటలకు వాస్తవం విరుద్ధంగా ఉండడంతో ఏదో జరుగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ నేతలు నిజాయితీతో వ్యవహరించకుండా ప్రజల ముందు వాస్తవాలు దాచిపెడుతున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా నేతలు దాచిపెడుతున్నారనే విషయం సామాన్యులకు కూడా చేరితే మరింతగా సమస్య ముదిరే ప్రమాదం పొంచి ఉంటుందనే అభిప్రాయం బలపడుతోంది