iDreamPost
iDreamPost
ఏ మూడ్ లో తమన్ అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటను కంపోజ్ చేశాడో కానీ ఆన్ లైన్ వేదికగా అది చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఇప్పటిదాకా తెలుగులో రంగస్థలంలోని రంగమ్మా మంగమ్మా పాటకు మాత్రమే సాధ్యమైన 200 మిలియన్ల వ్యూస్ కి అతి చేరువలో ఉంది. ఇది చదివే సమయానికి బహుశా ఆ మార్కు కూడా రీచ్ అయిపోయి ఉంటుంది. అక్షరం ముక్క తెలుగు రాని క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతటివాడే దీని మాయలో టిక్ టాక్ డాన్స్ చేశాడంటే ఇంత కన్నా విశేషం వేరే ఉంటుందా. లాక్ డౌన్ టైంలోనూ దీని ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. చాలా సెలెబ్రిటీలు ఈ సిగ్నేచర్ స్టెప్ ని నేర్చుకుని మరీ సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చేశారు. అంతగా ఆకట్టుకుందీ పాట.
దీని తాలుకు 58 సెకండ్ల చిన్న వీడియో బిట్ టీజర్ సైతం 50 మిలియన్ల వీక్షణలు తెచ్చుకోవడం అంటే మాటలా. ఇంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి మీద అర్మాన్ మాలిక్ పాడిన క్లిప్ ని సైతం 10 మిలియన్ల ప్రేక్షకులు చూశారు. ఇక మలయాళం డబ్బింగ్ వెర్షన్ వి కూడా కలిపితే లెక్కకు మతులు పోవడం ఖాయం. ఈ మధ్యకాలంలో ఇంత ఊపు ఊపేసిన పాట టాలీవుడ్ మరొకటి లేదన్నది అతిశయోక్తి కాదు. అసలే గొప్ప ట్యూన్లు అరుదైపోతున్న తరుణంలో బుట్ట బొమ్మ ఇంత స్థాయిలో దుమ్ము దులపడం చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.
నాన్ బాహుబలి థియేట్రికల్ రికార్డులను సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో ఇంకా శాటిలైట్ టెలికాస్ట్ జరగలేదు. వస్తే అది ఎంత సంచలనాలు సృష్టిస్తుందో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. సంక్రాంతి రేస్ లో రెండో స్థానం దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు టిఆర్పి లో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇది క్రాస్ చేస్తుందని సదరు ఛానల్ కూడా గట్టి నమ్మకంతో ఉంది. తమిళ్ లో ధనుష్ మారి 2 సినిమాలో రౌడీ బేబీ ప్రస్తుతం 850 మిలియన్ల వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. దాన్ని టార్గెట్ చేస్తూ దూసుకుపోయేలా ఉన్న బుట్ట బొమ్మ సెన్సేషన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఈ మేజిక్ కంటిన్యూ చేస్తే అదేమంత కష్టం కాదు.