Idream media
Idream media
బడ్జెట్ అనేది బ్రహ్మపదార్థం. అంత సులభంగా అర్థం కాదు. ఒకప్పుడు బడ్జెట్ రావడానికి ముందే సిగరెట్ల రేట్లు పెరిగేవి. బడ్జెట్ తర్వాత టీవీల రేట్లు పెరుగుతాయి, ఇప్పుడే కొనమని ప్రకటనలతో చంపేవాళ్లు.
జర్నలిస్టుగా చేరిన తొలి రోజుల్లో బడ్జెట్ వార్తలు రాయడం ఒక స్పెషల్ ఫీట్. అప్పుడప్పుడు టెక్నాలజీ బాగా వీక్. అప్పుడప్పుడే గ్యాలీలో అక్షరాలు పేర్చుకునే కాలం దాటి కంప్యూటర్ ప్రింటింగ్‌లోకి అడుగు పెట్టారు.
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI) పీటీఐ సంస్థల నుంచి టెలీప్రింటర్‌పై ముక్కలుముక్కలుగా ఇంగ్లీష్‌లో వార్తలు వచ్చేవి. వాటిని తెలుగులో అనువాదం చేసేవాళ్లు. ఇంగ్లీష్ బాగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు సునాయాసంగా లాగించే వాళ్లు కానీ, నాలాంటి వాళ్లు అపసొపాలు పడేవాళ్లు. పైగా బడ్జెట్ పదాలు చాలా చిత్రంగా ఉంటాయి. వాటిని శుద్ధ అనువాదం చేస్తే బండబూతులు వస్తాయి. అప్పట్లో జర్నలిస్టులకు ఉపయోగపడే ఇన్ని డిక్షనరీలు లేవు.
Read Also: కేంద్ర బడ్జెట్.. రంగాలు..కేటాయింపులు..
డైరెక్ట్ టాక్సెస్ అంటే నేరుగా పన్నులు, ఇన్‌డైరెక్ట్ అంటే దొంగదారి అని కూడా రాసేవాళ్లం. కొంత మంది మహానుభావులు రెడ్‌హ్యాండెడ్‌కి ఎర్రచేతులు అని కూడా అనువాదం చేసేవాళ్లు.
బడ్జెట్ మీద అనర్గళంగా మాట్లాడే జర్నలిస్టులకి కూడా ఇంటి బడ్జెట్ మీద అవగాహన ఉండేది కాదు. నెలాఖరికి అప్పులు, పదవీ విరమణ తర్వాత దివాళా.
ఆడవాళ్లకి అర్ధమైనంత బాగా బడ్జెట్ మంత్ర ఇంకెవరికీ కాదు. ఏం గారడీ చేస్తారో తెలియదు, వచ్చే కాసిన్ని డబ్బులతోనే పిల్లల చదువులు , ఇంటి ఖర్చులు, సినిమాలు అన్నీ పోయి పొదుపు కూడా చేస్తారు.
కూరగాయల దుకాణానికి వెళితే ఏది ఎంత మేర కొనాలో కళ్లతోనే నిర్ణయిస్తారు. ధరల ఆధారంగా ఆ వారంలో ఏం టిఫెన్లు చేయాలో , ఏం కూరలు వండాలో నిర్ణయించుకుని బడ్జెట్ సవరణలు చేస్తారు.
మగవాళ్ల వృథా ఖర్చులతో ఏర్పడే లోటు బడ్జెట్‌ని ఎలా పూడ్చాలో తెలిసిన వాళ్లు.
ఈ దేశమే ఒక ఇల్లు అనుకుంటే, దానికి నిర్మలాసీతారామన్ బడ్జెట్ మంత్రి. కొంప ముంచుతుందో, గట్టెక్కిస్తుందో?