Bro Daddy Report : బ్రో డాడీ రిపోర్ట్

ఇవాళ శుక్రవారం కాకపోయినా రిపబ్లిక్ డే సెలవు రోజు సందర్భంగా ఓటిటి రిలీజులు బాగానే వచ్చాయి. థియేట్రికల్ రన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ‘అర్జునా ఫల్గుణ’ ఆహాలో స్ట్రీమింగ్ కాగా. శాండల్ వుడ్ లేటెస్ట్ హిట్ ‘బడవ రాస్కెల్’ ఊట్ లో వచ్చేసింది. పుష్పలో జాల్ రెడ్డిగా నటించిన ధనుంజయ్ ఇందులో హీరో. అన్నిటికన్నా ఎక్కువగా మలయాళంలో రిలీజైన ‘బ్రో డాడీ’ మీద ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కి తెలుగు ఆడియో కూడా ఎక్స్ పెక్ట్ చేశారు కానీ కేవలం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే విడుదలయ్యింది. ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

జాన్ కట్టడి(మోహన్ లాల్), ఈషో(పృథ్విరాజ్) తండ్రికొడుకులు. ఈషో తన ప్రియురాలు అన్నా(కళ్యాణి ప్రియదర్శన్)తో లివిన్ రిలేషన్ లో ఉంటాడు. ఓ రోజు జాన్ భార్య(మీనా)గర్భం దాలుస్తుంది. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైంలో నాన్న ఇలా షాక్ ఇవ్వడంతో ఈషో షాక్ తింటాడు. ఊహించని పరిణామానికి ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో చిక్కుకుంటాడు. మరి జాన్ ఈ ఇబ్బంది నుంచి ఎలా బయటపడ్డాడు,ఈషోకు తన వల్ల సమస్య రాకుండా ఏం చేశాడో తెలియాలంటే బ్రో డాడీ చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే ఇది రెండు కుటుంబాల కథగా దర్శకుడు కం హీరో పృథ్విరాజ్ దీన్ని తీర్చిదిద్దారు. లైట్ గా ఎమోషన్స్ ని టచ్ చేశారు.

ఇది బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బాధాయి హో నుంచి స్ఫూర్తి తీసుకున్నదే. మెయిన్ పాయింట్ అదే అయినప్పటికీ ట్రీట్మెంట్ పరంగా చూస్తే మాత్రం వేరే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి కామెడీతో తేలికైన సన్నివేశాలతో పృథ్విరాజ్ టైం పాస్ వినోదాన్ని అందించాడు. ఇద్దరు హీరోల మధ్య సీన్లు బాగా పేలాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో టెంపో తగ్గిపోయి ల్యాగ్ పెరగడంతో బాగా యావరేజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కూడా గొప్పగా లేదు. ఓవరాల్ గా చెప్పుకుంటే ఈ బ్రో డాడీ ఓటిటి ఆడియన్స్ కి పర్ఫెక్ట్ వాచ్. మరీ తీవ్రంగా నిరాశపరిచే అంశాలు లేవు కనక ఓసారి హ్యాపీగా చూసేయొచ్చు. లెన్త్ 2 గంటల 40 నిముషాలు ఉండటం కొంత ఇబ్బంది. క్వాలిటీ క్యాస్టింగ్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ దన్నుగా నిలబడిన ఈ బ్రో డాడీని సబ్ టైటిల్స్ సహాయంతో చూడాల్సిందే

Also Read : Good Luck Sakhi : పోటీ లేకపోయినా పేచీ తప్పలేదు

Show comments