Brahmastra review: బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ రివ్యూ

నెలల తరబడి వందల కోట్లు తెచ్చే భారీ కమర్షియల్ సక్సెస్ లేక నిరాశలో ఉన్న బాలీవుడ్ ఆశలన్నీ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మీదే ఉన్నాయి. తెలుగు వెర్షన్ మీద బజ్ రావడానికి నాగార్జున ప్రత్యేక పాత్ర చేయడం, ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడమే కాక ప్రమోషన్లన్నీ దగ్గరుండి చూసుకోవడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేనిది రన్బీర్ కపూర్, అలియా భట్ లు జక్కన్నతో సహా సుమా చేసే రియాలిటీ షోలోనూ పాల్గొనడంతో చాలా కష్టపడుతున్నారనే ఫీలింగ్ కలిగింది. మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్న ఈ విజువల్ గ్రాండియర్ పార్ట్ 1 థియేటర్లలో అడుగు పెట్టింది. ఎలా ఉందో రివ్యూలో లుక్ వేద్దాం

కథ

డీజే శివ(రన్బీర్ కపూర్)కు అమ్మానాన్నా చిన్నప్పుడే చనిపోవడంతో అనాధాశ్రమంలో పెరుగుతాడు. ఓ వేడుకలో ఈషా(అలియా భట్)ను చూసి మనసు పారేసుకుని ప్రేమలో పడతాడు. ఎప్పుడుబడితే అప్పుడు కలలో ఎక్కడో జరిగే హత్యలు శివకు కనిపిస్తూ ఉంటాయి. శక్తివంతమైన ఓ అస్త్రం తాలూకు భాగాల కోసం జునూన్(మౌని రాయ్)అనే రాక్షసి ఓ శాస్త్రవేత్త(షారుఖ్ ఖాన్)ని చంపడం స్వప్నంలో చూసిన శివ ఆ తర్వాత అదే ప్రమాదంలో ఉన్న అనీష్ శెట్టి(నాగార్జున)ని కలుసుకుంటాడు. బ్రహ్మాస్త్రం తాలూకు రహస్యాన్ని ఛేదించడం కోసం ప్రేయసితో కలిసి ఈ బృందానికి పెద్దయిన ప్రొఫెసర్(అమితాబ్ బచ్చన్)ని కలుస్తాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి

నటీనటులు

లవర్ బాయ్ గా కెరీర్ ప్రారంభంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ఫ్యామిలీ వారసుడు రన్బీర్ కపూర్ బర్ఫీ, సంజూ లాంటి సినిమాలతో పెర్ఫార్మన్స్ పరంగానూ ఛాలెంజులు స్వీకరిస్తూ తనలో బెస్ట్ యాక్టర్ ని బయటికి తీసుకొచ్చాడు. కానీ ఈ బ్రహ్మాస్త్ర వాటి కోవలోకి రాదు. పూర్తిగా హంగుల మీద ఆధారపడిన ప్లాట్ కావడంతో నటనపరంగా సవాళ్లు లాంటివి ఇందులో ఎదురు కాలేదు. కాకపోతే లేనివి ఊహించుకుంటూ బ్లూ మాట్ లో నటించాల్సిన సీన్లలో ఈజీగా చేసుకుంటూ పోయాడు. మరీ గర్వపడే పాత్ర అయితే కాదు. రియల్ లైఫ్ పార్ట్నర్ తో లవ్ సీన్స్ లో మాత్రం ప్రత్యేకంగా జీవించాల్సిన పని లేకపోయింది. సహజంగానే వాటిలో ప్రేమ పుట్టేసింది.

అలియా భట్ కు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టరే దక్కింది. ఎక్కువ సేపు కాబోయే(షూటింగ్ టైంలో)భర్తతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కన్నా కోరుకునేది ఇంకేముంటుంది. నాగార్జున పావు గంట కంటే ఎక్కువ లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరుస్తుంది. ఆ ఎపిసోడ్ కూడా బిల్డప్ మీద నడిచిపోతుంది. ఎలాంటి మొహమాటం పెట్టుకోకుండా ఇంత చిన్న వేషానికి ఒప్పుకున్న షారుఖ్ ఖాన్ ని సరిగా ఉపయోగించుకోలేదు. అయినా కూడా తన టైమింగ్ తో స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తించేలా చేశాడు బాద్షా, అమితాబ్ బచ్చన్ ది ప్రత్యేకంగా ఏమి లేదు. మౌనిక రాయ్ లుక్స్ ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ తక్కువ తరహాలో అలా సాగిపోయింది. సపోర్టింగ్ క్యాస్టింగ్ పర్లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సబ్జెక్టు కోసం చాలా రీసెర్చ్ చేశామని, అస్త్రావర్స్ రూపంలో ఒక కొత్త అనుభూతిని భారతీయ సినిమాకు పరిచయం చేస్తామని పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. నిజానికి తను అనుకున్న పాయింట్ లో చాలా డెప్త్ గా వెళ్లే స్కోప్ ఉంది. మూడు కాదు అయిదు భాగాలైనా ఎక్స్ ప్యాండ్ చేసుకునే అవకాశముంది. అయినా ఆ స్థాయిలో హోమ్ వర్క్ చేసుకున్నట్టు అనిపించదు. ఫాంటసీలో లాజిక్ ఉండదు. నిజమే. ఎన్నిసార్లు చెప్పినా ఈ స్టేట్మెంట్ కి తిరుగులేదు. అది మేజిక్ చేసేలా ఉంటేనే జనం తర్కం గురించి ఆలోచించకుండా సినిమాలో లీనమైపోతారు. అయాన్ ఈ సూత్రాన్ని సరిగా అర్థం చేసుకుని ఒడిసిపట్టుకోలేకపోయాడు.

చిన్న ఉంగరం పోయినందుకే ఇంద్రుడి కూతురికి స్వర్గలోక ప్రవేశం లేదంటే నమ్మేశాం. హీరో ఆటోలో వెళ్తూ హీరోయిన్ చేతి వేళ్ళు తాకగానే నాలుగు వందల ఏళ్ళు వెనకటి జన్మ గుర్తొస్తే చప్పట్లు కొట్టాం. ఒకే కాలంలో కలుసుకోని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు కలిసి బ్రిటిషర్ల మీద యుద్ధం చేశారంటే వెయ్యి కోట్లు ఇచ్చేశాం. ఇవన్నీ ఎలా పాస్ అయ్యాయనే బేసిక్ క్వశ్చన్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో కథలు రాసుకునే ప్రతి దర్శకుడు రచయిత వేసుకునే తీరాలి. తెలుగు పక్కన పెడదాం. చేతికి గడియారం తొడిగితే మనిషి మాయం కావడమనే సిల్లీ పాయింట్ ని దిగ్గజ దర్శకుడు శేఖర్ కపూర్ చూపించినప్పుడు పాతికేళ్ల క్రితమే బ్లాక్ బస్టర్ అయ్యిందిగా.

ఇవన్నీ చెప్పడానికి కారణం అయాన్ ముఖర్జీ తన చేతిలో టెక్నాలజీ, త్రీడి ఎఫెక్ట్స్ సమకూర్చే టీమ్, భారీగా ఖర్చు పెట్టే నిర్మాత ఉన్నాడని చూసుకున్నాడే తప్ప వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకునే స్క్రిప్ట్ ప్రాపర్ గా ఉందో లేదో చూసుకోలేదు. బ్రహ్మాస్త్రని మనం చాలా ఎగ్జైట్మెంట్ తో ఏదేదో ఊహించుకుంటూ థియేటర్లలో అడుగు పెడతాం. అది మన తప్పు కాదు. ఊహించుకోండి మహాప్రభో అనేలా టీమ్ అలా పబ్లిసిటీ ఇచ్చింది. కానీ బ్రహ్మాస్త్ర మొదటి సీన్ నుంచి ఎక్కడా థీమ్ ని సరైన రీతిలో ఎస్టాబ్లిష్ చేసే తపన కనిపించదు. గంట పాటు అవసరం లేని శివ ఈషాల ప్రేమకథ, వాళ్ళిద్దరి మధ్య పాటలతో ఉత్తినే టైం వేస్ట్ చేశాడు అయాన్ ముఖర్జీ.

ఒక సీరియస్ మిషన్ మీద ప్రాణాలు కోల్పోయే వ్యక్తిని కాపాడేందుకు వారణాసికి బయలుదేరిన రన్బీర్ అలియా అక్కడికి చేరుకున్నాక కూడా డ్యూయెట్ పాడుకోవడం ఏమిటో ఆయనకే తెలియాలి. నిజ జీవితంలో వీళిద్దరి మధ్య బాండింగ్ ఎంత బలంగా ఉందో చెప్పాలనే తాపత్రయం అయాన్ లో బలంగా కనపడింది. ఇది పక్కన పెడితే కొన్ని లాజిక్స్ మరీ సిల్లీగా ఉన్నాయి. షారుఖ్, నాగ్ దగ్గర బలమైన అస్త్రాలు ఉన్నా జునూన్ రాగానే నిస్సహాయులుగా మారి చనిపోతారు. వాటిని ఆమె పక్కనున్న గూండాలు తీసుకుంటే మాత్రం వాళ్ళు చాలా శక్తివంతంగా మారతారు. అది ఎలా సాధ్యమో కన్విన్సింగ్ గా చెప్పాలిగా. అది లేనప్పుడు ఎంత యాక్షన్ ఉన్నా వృధా అవుతుంది

ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ దాకా నెరేషన్ చప్పగానే సాగుతుంది. ఆ ఎపిసోడ్ ఒక్కటే కొంత పర్లేదు అనిపించినా అక్కడా హై ఎమోషన్ కానీ ఎలివేషన్ కానీ ఏమీ ఉండదు. రెండో సగం బాగుంటుందేమోనన్న ఆశ పుట్టిస్తుంది అంతే. తర్వాత కొంత వేగం పెరిగినా ముందే చెప్పినట్టు ఆడియన్స్ తో కంటిన్యూగా కనెక్షన్ ఉండేలా అయాన్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. పిల్లలకు నచ్చే కొన్ని ఫైట్స్ ఉన్నాయి. 3డిలో వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ పెద్దల పరిస్థితి అలా ఉండదు కదా. పైగా విఎఫ్ఎక్స్ కూడా అంత హై స్టాండర్డ్ అనిపించదు. ఫైర్ వర్క్స్ తో ఏదేదో హడావిడి తెరమీద జరిగిపోతుంది తప్ప మైండ్ బ్లోయింగ్ అనిపించేలా మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ లేవు.

జానర్ ఏదైనా కోట్ల రూపాయల బడ్జెట్, గ్రాఫిక్స్ ఉంటే సరిపోదని చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. కార్తికేయ 2 అంతగా విజయం సాధించడానికి కారణం అందులో శ్రీకృష్ణ తత్వాన్ని ఇప్పటి తరానికి అర్థమయ్యేలా ప్రెజెంట్ చేసిన తీరు. బ్రహ్మాస్త్రలో అలాంటివేవీ ఉండవు. అస్త్రాలను కాపాడేందుకు హీరోతో సహా కొందరు రక్షకులు భూమి మీదున్నప్పుడు, దేవ్ ఆదేశాలతో ఇంత అరాచకం చేస్తున్న జునూన్ ని కట్టడి చేసేందుకు అసలు దేవుడి ప్రస్తావనే ఎక్కడా లేకుండా చేశారు. పోనీ అది సెకండ్ థర్డ్ పార్ట్ లో ఉంటుందనుకుంటే కనీసం దాని తాలూకు క్లూస్ అయినా ఇక్కడ ఇవ్వాలిగా. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సస్పెన్సే సీక్వెల్ కి హైప్ తెచ్చింది

అయాన్ ముఖర్జీలో ఆలోచలున్నంత గొప్పగా ఆచరణ సాగలేదు. ఇంతకన్నా గొప్ప గ్రాండియర్లను బాలీవుడ్ ఇచ్చింది చూసింది. కాబట్టి మనం గతంలో ఎన్నడూ చూడని అనుభూతినివ్వాలని కంకణం కట్టుకున్నప్పడు కావలసినది స్క్రిప్ట్ తో ఒప్పించే రైటర్లు కానీ కంప్యూటర్లతో కుస్తీ పట్టే ఇంజనీర్లు కాదు. దీంతో పోలిస్తే ఎప్పుడో వచ్చిన దేవి క్లైమాక్స్, కోడిరామకృష్ణ అమ్మోరులో చివరి ఘట్టం వేల రెట్లు ఎందుకు మెరుగో, అవి జనాన్ని ఎందుకంత మెప్పించాయో అర్థమవుతుంది. చిరంజీవి అంజిలో గ్రాఫిక్సే బ్రహ్మాస్త్ర కన్నా బెటరనిపిస్తే తప్పేం లేదు. ఉద్విగ్నత, ఆసక్తి,, థ్రిల్, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ సమపాళ్ళలో ఉంటేనే ఇలాంటి అస్త్రాలు పండుతాయి

సంగీత దర్శకుడు ప్రీతమ్ ఇచ్చిన పాటలు సోసోగానే ఉన్నాయి. హిందీలోనే అంతంత మాత్రంగా ఉంటే ఇక తెలుగులో ఎలా అనిపిస్తాయో వేరే చెప్పాలా. సైమన్ ఫ్రాంగ్లెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రయిలర్ లో వినిపించే శివమ్ శివమ్ సౌండ్ ని రిపీట్ చేసుకుంటూ పోయాడు తప్ప ప్రత్యేకంగా తన ముద్ర ఉండేలా ఏదీ లేదు. మణికందన్, పంకజ్, సుదీప్ లతో కలిసి మొత్తం అయిదుగురు ఛాయాగ్రాహకులు పనిచేశారని చెప్పారు కానీ ఎవరిని పొగడాలో ఎవరిని కామెంట్ చేయాలో అర్థం కాదు. ఆర్ట్ వర్క్ బాగున్నా విఎఫ్ఎక్స్ మైనస్ అయ్యింది. ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్ గానే ఉన్నాయి. ఖర్చు తెరమీద కనిపిస్తుంది

ప్లస్ గా అనిపించేవి

రన్బీర్ అలియా జంట
భారీతనం
కొన్ని యాక్షన్ బ్లాక్స్

మైనస్ గా తోచేవి

ప్రేమకథ
జీరో ఎమోషన్
సాగతీత
గొప్ప విఎఫ్ఎక్స్ కాదు

కంక్లూజన్

ఒకపక్క వెబ్ సిరీస్ లకే ఓటిటిలు వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఎంటర్ టైన్మెంట్ ప్రపంచంలో ఉత్తి గ్రాఫిక్స్ తో, పెద్ద క్యాస్టింగ్ ని తీసుకొచ్చి హడావిడి చేసి, సోల్ లేని కంటెంట్ తో ఎంత ఆర్భాటం చేసినా ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ ఈ బ్రహ్మాస్త్రని ఎలా ఊహించుకున్నాడో తెలియదు కానీ ఇప్పటి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా మాత్రం టేకింగ్ తో మెప్పించలేక యావరేజ్ కన్నా కింద మెట్టుపై నిలబడిపోయాడు. సినిమాలో అతిశయోక్తులు ఎన్ని చూపించినా పర్వాలేదు కానీ అవసరమైన కథలో ఆత్మను సరైన రీతిలో ప్రెజెంట్ చేయలేకపోతే ఎంత పెద్ద బ్రహ్మాస్త్రమైనా పిచ్చుక ముందు తోక ముడవాల్సి వస్తుంది.

ఒక్కమాటలో – గురి కుదరని అస్త్రం

రేటింగ్ : 2.25/5

Show comments