ఈ బిజినెస్ తో డబ్బే డబ్బు.. 14 వేల కొత్త పెట్రోల్ బంకులకు నోటిఫికేషన్.. లైసెన్స్, అర్హతలేంటి

వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటూ.. భారీగా ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్రోల్ బంక్ ఒకటి. మరి ఈ బిజినెస్ ప్రారంభించాలంటే.. ఏం చేయాలి.. అర్హతలేంటి.. పెట్టుబడి ఎంత కావాలి వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు..

వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటూ.. భారీగా ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్రోల్ బంక్ ఒకటి. మరి ఈ బిజినెస్ ప్రారంభించాలంటే.. ఏం చేయాలి.. అర్హతలేంటి.. పెట్టుబడి ఎంత కావాలి వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు..

చాలా మందికి నెలంతా కష్టపడి ఆఖర్లో జీతం తీసుకోవాలంటే ఇష్టముండదు. ఒకరి కింద పని చేసే బదులు.. తామే నలుగురికి ఉపాధి కల్పించాలని భావిస్తారు. అందులో భాగంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారు. అయితే బిజినెస్ అంటే మాటలు కాదు.. పెట్టుబడి ఎంత ముఖ్యమో.. అనుభవం, ఆలోచన, ఓపిక కూడా అంతే అవసరం. ఇక కొన్ని వ్యాపారాలకు ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. కొన్ని సీజనల్ వ్యాపారాలుంటాయి. ఇక కొన్ని వ్యాపారాలు ఒక్కసారి ప్రారంభిస్తే చాలు.. ఏడాదంతా ఆదాయం వచ్చేవి ఉంటాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఈ కోవకు చెందిన బిజినెస్ ఐడియానే. ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎప్పుడు రద్దీగా ఉండటమే కాక.. బోలేడంత ఆదాయం కూడా. ఇంతకు ఏంటా బిజినెస్ అంటే.. పెట్రోల్ బంక్.

ఇక పెట్రోల్ బంక్ ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 14,273 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఇటీవలే పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. మరి పెట్రోల్ బంక్ ప్రారంభించేందుకు అర్హతలు ఏంటి.. పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అర్హతలు..

పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేందుకు అర్హత విషయానికి వస్తే.. 21-55 ఏళ్ల వారు అర్హులు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసే వ్యక్తికి రిటైల్ అవుట్‌లెట్, ఇతర బిజినెస్ నిర్వహించడంలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుడి ఆదాయం కనీసం రూ.25 లక్షలు ఉండాలి. అలాగే తన కుటుంబం మొత్తం సంపద రూ.50 లక్షలకు మించకూడదు. అంతేకాక దరఖాస్తుదారుడికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఏదైనా వ్యాపారంలో డీఫాల్టర్‌గా కూడా ఉండకూడదు.

భూమి ఎంత ఉండాలంటే..

పెట్రోల్ బంక్ ప్రారంభించేందుకు భారీ పెట్టుబడితో పాటు.. భూమి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది ప్రాంతం, పంపిణీ యూనిట్లను బట్టి అవసరమవుతుంది. దరఖాస్తుదారుడి పేరుపై ఈ ల్యాండ్ ఉండాలి. చట్టపరంగా ఎలాంటి వివాదాలు ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ తెరిచేందుకు.. సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరమవుతుంది. రెండు డిస్పెన్సింగ్ యూనిట్ల కోసమైతే 1200 చదరపు మీటర్ల భూమి కావాల్సి ఉంటుంది.

అదే అర్బన్ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌ కోసం 500 చదరపు మీటర్లు.. రెండు డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం 800 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే జాతీయ రహదారులపై పెట్రోల్ బంక్ ఒపెన్ చేయాలంటే సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 1200 చదరపు మీటర్లు, రెండు డిస్పెన్సింగ్ యూనిట్లకు 2000 చదరపు మీటర్ల భూమి కావాల్సి ఉంటుంది.

పెట్టుబడి ఎంత కావాలంటే

పెట్రోల్ బంక్ బిజినెస్ కు భారీ మొత్తంలో పెట్టుబడి అవసంర ఉంటుంది. దీనిలో భూమి ధర, నిర్మాణ ఖర్చు, మిషినరీ ఖర్చులు, లైసెన్సింగ్ ఫీ వంటివి కలిసి ఉంటాయి. పెట్టుబడి వ్యయంలో గణించే భూమి విలువ రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండొచ్చు. నిర్మాణం ఖర్చు విషయానికొస్తే.. డిజైన్, మెటీరియల్స్, పెట్రోల్ బంక్ పరిమాణం బట్టి ఉంటుంది.

ప్రాంతాన్ని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పెట్టుబడి వ్యయం ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎక్విప్‌మెంట్ కాస్ట్ లో.. ఫ్యూయెల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఖర్చు, స్టోరేజీ ట్యాంకుల ఖర్చు, ఇతర మెటీరియల్ ఉంటాయి. దీనికి రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. లైసెన్స్ ఫీజుల కోసం మరి కొంత అనగా రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

లైసెన్స్ ఎలా పొందాలంటే..

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్ పీ సీ ఎల్, ఎస్ ఆర్, రిలయన్స్ కంపెనీలు.. పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు కోసం లైసెన్స్ జారీ చేస్తాయి. దీనికి సంబంధించి పేపర్లు, అధికారిక వెబ్సైట్లలో ప్రకటనలు ఇస్తుంటాయి. లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తాయి. ఇక ఛయాన్ వెబ్‌సైట్‌ https://www.petrolpumpdealerchayan.in/ లో ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఏదైనా డీలర్‌షిప్‌కు ప్రకటన చూసినప్పుడు.. అందులోనే అన్ని వివరాలు, కండీషన్లు ఉంటాయి.

  • రిజిస్టర్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. అకౌంట్ తెరవాలి.
  • లాగిన్ అయి అవేలబుల్ అడ్వర్టైజ్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
  • కంపెనీ పేరు, రాష్ట్రం ఎంపిక చేసుకొని.. అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • అడిగిన సమాచారం మొత్తం అందివ్వాలి.
  • తర్వాత మీ ఫొటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.
  • అనంతరం సబ్మిట్‌ బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి.
  • ఈ ఆన్‌లైన్ పేమెంట్.. ఖర్చు ప్రాంతాలను బట్టి మారుతుంటుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో రూ.100, మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో రూ.1000 ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారి అప్లికేషన్ ఫీలో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Show comments