రాజకీయాలను మతంతో ముడిపెట్టి లబ్ధి పొందాలని ఎత్తులు వేసి భారతీయ జనతా పార్టీ తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం అదే ఎత్తు వేసి, ఎన్నికల ముందు నానాయాగీ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మతం మీద రాజకీయాలు చేసి, ఓటర్లను తికమక పెట్టేందుకు ప్రయత్నాలు ఢిల్లీ వేదికగా మొదలు పెట్టింది.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువు కాదని, మతం మారితే అతడికి రిజర్వేషన్ వర్తించదని, క్రైస్తవుడు అయిన డాక్టర్ గురుమూర్తి ని వెంటనే ఎన్నికల నుంచి డిస్ క్వాలిఫై చేయాలని కేంద్రం ఎన్నికల సంఘానికి బిజెపి నాయకులు మెమోరాండం పంపారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ లతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గత కొద్ది రోజులుగా గురుమూర్తి మతం మీద పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్న తరుణంలో, సరిగా ఎన్నికల ముందు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లడం ఇప్పుడు బిజెపి నేతలు రాజకీయాలను బయటపెడుతోంది.
ఒక రాజకీయ నాయకుడిగా లేదా అందరికీ సమాజంలో సుపరిచితులైన వ్యక్తిగా అన్ని మతాలను గౌరవించడం తప్పేమీ కాదు. డాక్టర్ గురుమూర్తి ఈ దృష్టితోనే అన్ని మతాల సమ్మేళనాల్లో పాల్గొంటూ వచ్చారు. గతంలో ఆయన హిందూ ఆలయాలను సందర్శించిన దాఖలాలు బోలెడు ఉన్నాయి. అదేమీ పట్టించుకోకుండా కేవలం డాక్టర్ గురుమూర్తి చర్చిల్లో ప్రార్థనలు చేసిన పలు చిత్రాలను సేకరించి బిజెపి నాయకులు, ఎస్సీ రిజర్వుడ్ నియోజక వర్గంలో మతం మారిన వ్యక్తికి ఎలా సీటు ఇస్తారని కొత్త వివాదం లేవదీశారు. కేవలం ఎన్నికల స్టంట్ గా ఇప్పటివరకూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ వచ్చినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పాటు ఓటర్ల నుంచి బీజేపీ లేవనెత్తిన మతం అంశంలో మద్దతు లేకపోవడంతో సరిగ్గా ఎన్నికల వేళ దీనిని పెద్దవి చేసి ప్రయోజనం పొందాలని బిజెపి భావిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికకు 17వ తేదీన ఎన్నికలు ఉన్న తరుణంలో ఓటర్లను మతం ప్రాతిపదికన విభజించి, తారా స్థాయి రాజకీయాలను చేయాలనేది బీజేపీ వ్యూహం. దీనిలో భాగంగానే ఇప్పటివరకు గురుమూర్తి మతం మీద పలు అనుమానాలు పుట్టించి, ప్రచారం చేసిన బిజెపి నాయకులు కేవలం ఆయన చర్చలకు వెళ్లిన చిత్రాలను, ఇతర వీడియోలను తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెడితే ఖచ్చితంగా అక్కడి నుంచి ఏమైనా కీలక ఆదేశాలు వస్తే అదే ఎన్నికల్లో ప్రధాన బలంగా పని చేస్తుందని ఎత్తులు వేస్తోంది.
ఇప్పటికే వైసీపీ గెలుపు ఖాయం అయిన తిరుపతిలో మతం ద్వారానే గరిష్టంగా లబ్ధి పొందాలని బీజేపీ ఆలోచన. దీనిలో భాగంగానే చివరి నిమిషంలో గురుమూర్తి మీద లేనిపోని విషయాలను పుట్టించి మరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. ఈ ఫిర్యాదు నిలబడదని బిజెపి పెద్దలకు తెలిసినప్పటికీ ఎన్నికలకు ముందు గురుమూర్తి గెలిస్తే కచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు అనే ప్రచారం బలంగా చేసి, లబ్ది పొందాలనే వ్యూహంతోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఏ మాత్రం ఫలించే అవకాశాలు తిరుపతిలో కనిపించడం లేదు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా… ముఖ్యమంత్రి సీఎం పెట్టిన మెజారిటీ టార్గెట్ ను మించి వైఎస్ఆర్సిపి బలం కనిపిస్తోంది.