Idream media
Idream media
దిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మతపరమైన భారీ ప్రార్థన సభ వెళ్లిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ బిజెపి ఎమ్మెల్యే సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. సభకు హాజరైన వారే ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌లుగా తేలుతుండడంతో వారికి సంబంధించిన వారికి వైద్యాధికారులు పరీక్షలు జరుపుతున్నారన్న రాజా సింగ్ అందుకు కొంత మంది సహకరించడంలేదని పేర్కొన్నారు. అలాంటివారిని కాల్చి పారేయాలని వ్యాఖ్యానించారు. వారిని చంపేసి దేశాన్ని, తెలంగాణ, ఏపీని కాపాడుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కొంత మంది వల్ల అందర్నీ ప్రమాదంలో పెట్టలేమని రాజా సింగ్ ఫైర్ అయ్యారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని, ఆ ప్రార్థనలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒక వేళ ఎవరైనా సహకరించకపోతే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి తమ రాష్ట్రాలను కాపాడుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అప్పటికే కరోనా వైరస్ కేసులు నమోదైన వేళ దిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మతపరమైన భారీ ప్రార్థన సభ ఎలా నిర్వహిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. మార్చి 13 నుంచి 15 మధ్య ఈ సభ జరిగిందని, దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిలదీశారు. ఈ ప్రార్థన సభకు తెలంగాణ, ఏపీ నుంచే కాక, దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని గుర్తు చేశారు. అంతేకాక, ఇండోనేసియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని పేర్కొన్నారు.
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మంగళవారం ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీ కి వెళ్లి వచ్చిన వారే కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా కేసులలో ఏపీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 కి చేరింది. ప్రతి జిల్లా నుంచి ఢిల్లీ కి వెళ్లిన వారిని గుర్తిస్తున్న అధికారులు వారికి పరీక్షలు చేయిస్తున్నారు. ఇంకా ఎంత మందికి వైరస్ సోకిందన్న ఆందోళనతో పాటు.. వీరి ద్వారా స్థానికంగా మరెంతమందికి కరోనా సంక్రమించి ఉంటుందన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.