రాజకీయ నాయకులు ప్రజాసమస్యల కంటే వివాదస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా బీజేపీ నేతలు తరచూ ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్య చేస్తుంటారు. తాజాగా కర్ణాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే పాటియత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా ఈ వ్యాఖ్యలను కొనసాగిస్తూ..మరిన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
బుధవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నిర్వహించిన ఓ సభలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి పాటియత్నాల్ పాల్గొన్నారు. బీజేపీ పార్టీ చెప్పట్టిన కార్యక్రమాలు, మోదీ పాలన గురించి ఎమ్మెల్యే పలు కీలక విషయాలను తెలిపారు. అనంతరం భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విధానం గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాక ఆయన ఇంకా మాట్లాడుతూ..శాంతియుత పోరాటం చేస్తే భారత దేశానికి ఎన్నటికీ స్వాతంత్య్రం వచ్చేది కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరాహార దీక్షల వలన మనకు స్వాతంత్ర్యం రాలేదని బాబా సాహెబ్ అంబేడ్కర్ ఒక పుస్తకంలో రాశారని ఎమ్మెల్యే చెప్పారు.
ఒక చెంపపై కొడితే మరో చెంప చూపిస్తూ శాంతియుతంగా పోరాటం చేస్తే భారతదేశానికి స్వాతంత్ర్యం నేటికీ వచ్చేది కాదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్లను భయపెట్టడం వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. బసనగౌడ పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతోన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారి తీశాయి. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. కర్ణాటకలో ఇటీవల కొలువుదీరిన సిద్ధరామయ్య సర్కార్.. వచ్చే 6, 7 నెలల్లో కూలిపోతుందని ఆగస్టు నెలలో బసనగౌడ పాటిల్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. మరి.. బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.