iDreamPost
iDreamPost
కొన్నిసార్లు అంతే.. మాటలు కోటలు దాటుతుంటయ్. చేతలు మాత్రం ఇంటి గేటు కూడా దాటవు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతల తీరు కూడా ఇలానే ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంట. ఒక్క ఎంపీ సీటు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తారంట. అంతేనా.. ఇంకా చాలానే చెప్పారు లాయర్ కమ్ ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా ఆగిందట. తెలంగాణలో వచ్చిన దుబ్బాక ఫలితమే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పునరావృతం అవుతుందని చెప్పి వెళ్లారాయన.
ఈ ప్రశ్నలకు జవాబులున్నాయా?
• 2014లో ప్రధాని అభ్యర్థిగా ఇదే తిరుపతిలో ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ.. ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. ఆయన మాటలు నమ్మి రెండు ఎంపీ సీట్లలో, మరో నాలుగు ఎమ్మెల్యే సీట్లలో బీజేపీని గెలిపించారు ప్రజలు. మరి ఇచ్చిన మాటను మోడీ నిలబెట్టుకున్నారా? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తప్ప ఇంకేమైనా ఇచ్చారా? దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి మాటే నిలబెట్టుకోనప్పుడు.. మీ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారు?
Also Read : తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు?
• ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా ఆగిందని రఘునందన్ చెబుతున్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డురాని సాంకేతిక కారణాలు ఆంధ్రప్రదేశ్ విషయంలోనే అడ్డువస్తున్నాయా? గత ఏడేండ్లుగా ఆ సాంకేతిక కారణాలను ఎందుకు పరిష్కరించలేదు. ఇంతకీ ఏంటా సాంకేతిక కారణాలు?
• ఒక్క ఎంపీ సీటు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తామని అంటున్నారు. 2014లో ఏపీ ప్రజలు రెండు సీట్లు గెలిపించారు. మరి రాష్ట్రానికి మీరు ఏమిచ్చారు? సరే అది వదిలేద్దాం.. తెలంగాణలో నలుగురు ఎంపీలను 2019లో గెలిపించారు కదా.. మరి ఆ నలుగురు తెలంగాణ రూపురేఖలను మార్చారా? ఎంపీగా ఎన్నిక కాగానే పసుపు బోర్డు తెస్తానన్న వ్యక్తి రెండున్నరేళ్లు అవుతున్నా ఎందుకు తీసుకురాలేదు. తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెబుతుంటే.. మాకూ కావాలని మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదు.
• శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని రఘునందన్ విమర్శించారు. ఈ ఆరోపణలు నిజమో కాదో మీ విజ్ఞతకే వదిలేద్దాం. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి దర్జాగా పారిపోయిన వాళ్లను మీరు ఎందుకు పట్టుకోలేదు. మీకు తెలియకుండానే విమానాల్లో ఎగిరిపోయారా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబితే.. అప్పుడు మీకు ఓటు వేయాలా వద్దా అనేది జనం నిర్ణయించుకుంటారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చే హామీలను విని.. ‘‘మాకు నమ్మకం లేదు సార్’’ అని చెబుతున్నారు.
Also Read : తిరుపతి ఉప ఎన్నిక – గాజు గ్లాస్ గుర్తు పొందిన గోదా రమేష్ ఎవరు ?