ఏపీలో విగ్రహాలపై దాడులు రోజురోజుకు రాజీకీయంగా కాక పుట్టిస్తున్నాయి. అటు బీజేపీ-జనసేన,ఇటు టీడీపీ ఆలయాలపై దాడులను క్యాష్ చేసుకునేందుకు నానా హంగామాచేస్తున్నాయి. ముఖ్యంగా రామతీర్థం ఘటనతో పరిస్థితి పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
ఏపీలో కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న ఘటనలపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 144 ఘటనలు జరిగాయని తెలిపారు. గవర్నర్ తో భేటీ అనంతరం వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బుద్ధా వెంకన్న, శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్ తమ ఆత్మ అని చెప్పిన కొందరు మఠాధిపతులు, స్వామీజీలు ఆలయాలపై దాడులు జరిగిన సమయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సదరు ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మాన్ని పరిరక్షించకుండా రాజకీయాల కోసమే ఉన్నారా? అని నిలదీశారు. అయితే తానోటి తలిస్తే దైవం మరోటి తలిసినట్లు..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నించిన టీడీపీకి పరిస్థితి బూమరాంగ్ అవుతోంది. ఆది నుంచి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించిన దాంట్లో నిజం ఉందన్న వాదనలకు బలం చేకూరుతోంది. జగన్ పై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి సంబంధించి జాతీయ మీడియాలో సైతం చర్చ జరగడం ప్రారంభమైంది. తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ అని పలువురు ఆరోపిస్తున్నారని… జగన్ ఎలా క్రిస్టియన్ అవుతారో తనకు అర్థం కావడం లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గతంలో ఒక రోజు తెల్లవారుజామున 2 గంటలకే తిరుమల వేంకటేశ్వరస్వామి పూజలో జగన్ పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని క్రిస్టియన్ అని ఎలా చెప్పగలమని అన్నారు. జగన్ క్రిస్టియన్ అని ఎవరైనా ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఈ ఆరోపణల వెనుక చంద్రబాబు కుట్ర దాగుందని చెప్పారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు ఘోర ఓటమిని మూటకట్టుకున్నారని… ఈ నేపథ్యంలో, మళ్లీ పూర్వవైభవం సాధించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని అన్నారు. హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారని విమర్శించారు.
మరోవైపు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన హయాంలో ఆలయాలు కూల్చినందుకే చంద్రబాబు నేడు ఇంతగా పతనం అయ్యారని విమర్శించారు. ఇప్పుడు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని, ఆయన మరింత పతనం కావడం తథ్యమని హెచ్చరించారు. గతంలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చారని, విజయవాడలో ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. ఇవాళ మతరాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, తన హయాంలో సీపీగా నియమించుకోలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న అధికారులంతా చంద్రబాబు హయాంలోనివారేనని, సీఎం జగనేమీ కొత్తగా తీసుకురాలేదని రోజా వివరించారు.
సుబ్రమణ్యస్వామి ప్రకటన చూస్తుంటే ఏపీలో విగ్రహాల ధ్వంస రచన వెనుక చంద్రబాబు ఉన్నాడన్న వైసీపీ ఆరోపణలకు బలంచేకూరుతుంది.