iDreamPost
android-app
ios-app

బీజేపీకి ఆ పేరు అందుకే వచ్చిందా..?

బీజేపీకి ఆ పేరు అందుకే వచ్చిందా..?

భారతీయ జనతా పార్టీ.. 90వ దశకం వరకూ అతి సామాన్యమైన పార్టీ. అనతి కాలంలోనే దేశాన్ని పాలించే స్థాయికి చేరుకుంది. ఇది ఎలా సాధ్యమైందనేది పక్కనబెడితే.. ఆ పార్టీపై ఓ ముద్ర ఉంది. బీజేపీ కార్పొరేట్ల పార్టీ. కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాస్తుంది. ఇదీ బీజేపీపై జరిగే ప్రచారం. కాదని బీజేపీ సానుభూతిపరులు, అవునని వ్యతిరేకులు వాదించుకుంటుంటారు. వ్యతిరేకులు కొన్ని ఉదహరణలు కూడా చెబుతుంటారు. అందులో ముఖ్యమైనది ఆ పార్టీకి వచ్చిన ఎన్నికల విరాళాలు.

ప్రతి ఎన్నికల్లోనూ దేశంలో అన్ని పార్టీలలోకెళ్ల బీజేపీకే అధిక మొత్తంలో విరాళాలు అందుతాయి. కాంగ్రెస్‌ దాని దరిదాపుల్లో కూడా ఉండదంటే బీజేపీకి బడాబాబుల మద్ధతు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. తాజాగా గత సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలను ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది.

దేశంలో ఏడు జాతీయ, 25 ప్రాంతీయ పార్టీలకు 6,405.50 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. ఇందులో సింహభాగం బీజేపీకి వచ్చాయి. ఆ పార్టీకి 4,057.40 కోట్లు విరాళాల రూపంలో సమకూరాయి. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నిలిచింది. ఆ పార్టీకి 1,167.14 కోట్లు వచ్చాయి. ఇక ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకి 221.58 కోట్లు, తృణముల్‌ కాంగ్రెస్‌కు 141.09 కోట్లు, టీడీపీకి 131.33 కోట్లు, టీఆర్‌ఎస్‌కు 129.26 కోట్ల విరాళాలు దక్కాయి. మొత్తం విరాళాల్లో మూడింట రెండొంతులు బీజేపీకే రావడం గమనార్హం.

కాగా, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్, ఐఎన్‌ఎల్‌డీ పార్టీలు మాత్రమే రూపాయి కూడా విరాళాలు స్వీకరించలేదు.