iDreamPost
android-app
ios-app

4 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు

  • Published Apr 16, 2022 | 6:21 PM Updated Updated Apr 17, 2022 | 3:24 AM
4 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు

నాలుగు రాష్ట్రాల్లో ఒక లోకసభ,నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురైంది. మొత్తం అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు కొనసాగుతోంది. తుది సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోకసభ నియోజకవర్గంలో సినీ నటుడు, టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న్ సిన్హా 1.50 లక్షలకు పైగా ఆధిక్యంలో ఉండగా, ఆ రాష్ట్రంలోని బల్లిగంజ్ అసెంబ్లీ సీటులో టీఎంసీ అభ్యర్థి బాబుల్ సుప్రియో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. బీహార్ రాష్ట్రం బొచాహన్ లో ఆర్జేడీ, మహారాష్ట్రలోని నార్త్ కొల్హాపూర్ లో కాంగ్రెస్ విజయం సాధించాయి. చత్తీస్గఢ్ లోని ఖైరాగఢ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

బెంగాల్ ఎంపీగా శత్రుఘ్న సిన్హా

పశ్చిమ బెంగాల్లో ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కేంద్ర మంత్రి పదవి కోల్పోయిన బాబుల్ సుప్రియో బీజేపీకి, అసన్ సోల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెసులో చేరడంతో అసన్ సోల్ ఉప ఎన్నిక అవసరమైంది. బీహార్ కు చెందిన మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హాను ఇక్కడ అభ్యర్థిగా టీఎంసీ నిలబెట్టింది. ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన అగ్నిమిత్ర పాల్ పై 1.50 లక్షలకు పైగా భారీ ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. శత్రుఘ్నకు 3.70 లక్షల పైచిలుకు ఓట్లు లభించగా, అగ్నిమిత్ర పాల్ కు 2.16 లక్షల ఓట్లు లభించాయి. కాగా బల్లిగంజ్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బెంగాల్ రాష్ట్ర మంత్రి సుబ్రతో ముఖర్జీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి బాబుల్ సుప్రియో 20 వేలకుపైగా ఆధిక్యంలో ఉన్నారు. బాబుల్ సుప్రియోకు 50,996 ఓట్లు లభించగా, సీపీఎం అభ్యర్థి ఖమృజ్జమాన్ చౌదరి 30940 ఓట్లతో వెనుకబడ్డారు.

కాంగ్రెసుకు రెండు

మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ బీజేపీని కాంగ్రెస్ ఖంగు తినిపించింది.మహారాష్ట్ర నార్త్ కొల్హాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్ యాదవ్ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. దివంగత ఎమ్మెల్యే సతీమణి జయశ్రీ యాదవ్ ను కాంగ్రెస్ బరిలో నిలపగా ఆమె 19500 మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సత్యజిత్ కదమ్ పై విజయం సాధించారు.
చత్తీస్గఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఖైరాగఢ్ ఉప ఎన్నిక అవసరమైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యశోధవర్మ బీజేపీ అభ్యర్థి కమల్ జంగేల్ పై 1242 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్ లోని బొచాహన్ నియోజకవర్గాన్ని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నిలబెట్టుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే ముసాఫిర్ పాశ్వాన్ తనయుడు అమర్ పాశ్వాన్ 35 వేల మెజారిటీతో విజయం సాధించారు. పాశ్వాన్ కు 80116 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బేబీ కుమారికి 45353 ఓట్లు లభించాయి.