బీహార్ లో 7 పార్టీల మహాకూటమి ప్ర‌భుత్వం!, మ‌ళ్లీ చేతులు క‌లిపిన‌ నితీష్ కుమార్, తేజస్వి యాదవ్

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చింది, బీహార్ లో పోయింది. బీహార్ అధికార JD(U)-BJP కూటమిలో అనేక సమస్యలపై రెండునెల‌లుగా గందరగోళం. జేడీయు చీలుతుంద‌న్న ఆందోళ‌న‌ల మ‌ధ్య‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలుసుకుని తన రాజీనామా లేఖ ఇచ్చారు. ఇక బీజేపీతో తెగ‌తెంపులైన‌ట్లే. నితీష్ ఇలా బీజేపీని కాద‌నుకోవ‌డం ఇది రెండోసారి. బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను నిరాకరించడం వంటి అంశాలపై రెండు నెలలుగా JD(U), BJP మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికితోడు జేడీయు పార్టీని శివ‌సేన త‌ర‌హాలో చీల్చ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని జేడీయు న‌మ్మంది. ఈలోగా విధానసభ శతాబ్ది ఉత్సవాల కోసం, బిజెపికి చెందిన అసెంబ్లీ స్పీకర్ పంపిన ఆహ్వానాలలో నితీష్ పేరు లేకపోవడాన్ని జెడి (యు) చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. అందుకే కొత్త ఎత్తుగ‌డ వేసింది.

నితీష్ కుమార్ ఈ రోజు బిజెపిని విడిచిపెట్టారు. తేజస్వి యాదవ్ , కాంగ్రెస్ తో స‌హా ఇతర ప్రతిపక్ష పార్టీలను క‌లుపుకొంటూ “మహాకూటమిని ఎర్పాటుచేశారు. దీనికి అధినేత‌గా, బీహార్ ముఖ్యమంత్రిగా
మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్క‌నున్నారు నితీష్ కుమార్.

“ఏడు పార్టీల మహాకూటమి, ఒక స్వ‌తంత్ర అభ్య‌ర్ధితో క‌ల‌సి ప‌నిచేస్తుంది” అని నితీష్ కుమార్ ప్ర‌క‌టించారు. త‌న‌తో పొస‌గ‌ని బీజేపీని ప‌క్క‌న‌పెట్టి, ఒక‌నాటి మిత్రుడు లాలూ కుమారుడితో కొత్త ప్ర‌భుత్వాన్ని ఎర్పాటుచేస్తున్నారు. ముందు గవర్నర్ క‌ల‌సి రాజీనామా లేఖ ఇచ్చారు. గంట తరువాత, తేజస్వి యాదవ్ , ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి గవర్నర్ వద్దకు తిరిగి వచ్చారు. వారికున్న‌ ఉమ్మడి బలాన్ని బ‌ట్టి, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు.

కొంత‌కాలం త‌ర్వాత బీహార్ రాజ‌కీయాలు మ‌ళ్లీ చురుగ్గా త‌యారైయ్యారు. ఒక‌ప‌క్క నితీష్ కుమార్ త‌న జేడీయు ఎమ్మెల్యేల‌తో స‌మాశ‌మైన‌స‌మ‌యంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత 32 ఏళ్ల‌ తేజస్వి యాదవ్ , తన ఎమ్మెల్యేలతో స‌మావేశ‌మైయ్యారు. కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్‌కు మద్దతు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రికానున్నారు.

అధికారం కోసం భాగ‌స్వాముల‌ను మార్చి నితీశ్‌ కుమార్‌ ప్రజల తీర్పుకు ద్రోహం చేశారని బీజేపీ ఆరోపించింది. నిజానికి అటు నితీష్ రాజ‌కీయ క్రీడ‌లో అటు బీజేపీ, ఇటు ఆర్జీడీ రెండు పార్టీలూ ఆయ‌న‌కు ఉప‌యోప‌డ్డాయి. ఇద్ద‌రిసాయంతోనూ ఆయ‌న అధికారంలోనే ఉన్నారు. 2015 వరకు, నితీష్ కుమార్ బిజెపితో క‌ల‌సి ఉన్నారు. నరేంద్ర మోడీ ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా నిల‌వడం ఆయ‌న‌కు ఇష్టంలేదు. అందుకే 2015లో నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని లాలూ యాదవ్, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లాలూ యాదవ్ తేజస్వి యాదవ్ తండ్రి. 2017లో అవినీతిని తాను సహించలేనని నితీష్ కుమార్ మూడు పార్టీల కూటమి నుండి తప్పుకున్నారు. మ‌ళ్లీ బీజేపీతో క‌ల‌సి ప్ర‌భుత్వాన్ని ఎర్పాటుచేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో సీట్లు త‌క్కువ వ‌చ్చాయి. అయినా బీజేపీ నితీష్ నే సీఎంని చేసింది. ప‌గ్గాలు త‌న‌చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు బీజేపీని కాద‌ని, ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఎర్పాటుచేయ‌నున్నారు.

బీహార్ అసెంబ్లీలో బ‌లాబ‌లాలు

బీహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారాన్ని చేప‌ట్టింది. బీజేపీ 74, నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ (యునైటెడ్) 43 సీట్లు గెల్చుకున్నాయి. వికాశీల్ ఇన్సాన్ పార్టీ 4, హిందుస్తాన్ ఆవామ్ పార్టీ (సెక్యులర్) 4 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122-మెజారిటీ మార్కు కంటే NDAకి ఎక్కువ సీట్లు వ‌చ్చాయి.

మరోవైపు ఆర్జేడీ, దాని మిత్రపక్షాలు 110 సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. వామపక్షాలు పోటీ చేసిన 16 స్థానాల్లో గెలుపొందగా, సీపీఐ (ఎంఎల్-లిబరేషన్) 12 స్థానాల్లో విజయం సాధించింది. ఇక‌, సీమాంచల్ ప్రాంతంలో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆత‌ర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి మారారు.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే మరణం కారణంగా 242 సీట్ల‌కు త‌గ్గింది. ఇందులో BJP (77), JD(U) (45), HAM(S) (4), RJD (79), కాంగ్రెస్ (19), CPI(M-L) (12), CPI (4), AIMIM (1), ఇండిపెండెంట్ (1) సభ్యుల బ‌ల‌ముంది.

Show comments