iDreamPost
iDreamPost
దేశమంతా ఎదురుచూస్తోంది. మూడు వారాల లాక్ డౌన్ తో విలవిల్లాడుతున్న కోట్ల మందిలో ఉత్కంఠ మొదలయ్యింది. ఏప్రిల్ 14 తో తొలి దశ లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. దాంతో మళ్ళీ పొడిగిస్తారా లేక ఇతర మార్గాలు అన్వేషిస్తారా అన్నది అంతుబట్టకుండా ఉంది. దాంతో లాక్ డౌన్ చిక్కుల్లో ఉన్నరోజువారీ కూలీలంతా తమ సమస్యలకు ముగింపు దొరుకుతుందా అనే ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విరుచుకుపడితే మా గతి ఏం కానూ అనే బెంగ కూడా సర్వత్రా ఉంది. దాంతో కేంద్రం కూడా మల్లగుల్లాలు పడుతోంది. సహజంగా ఎవరూ ఊహించని నిర్ణయాలు, ఒంటరిగా తీసుకునే మోడీ కూడా ఈసారి అందరితో మంతనాలు జరపాల్సి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రధాని మోడీ ఇప్పటికే ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజాగా విపక్ష కాంగ్రెస్ నేతలతో పాటుగా పలువురు సీఎంలతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈనెల 8న వివిధ పార్టీలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో కనీసంగా ఐదుగురు ఎంపీలున్న పార్టీలను ఆహ్వానించినట్టు సమాచారం. ఇలా వివిధ రూపాల్లో మోడీ అభిప్రాయ సేకరణకు పూనుకోవడం ఒకరకంగా ఆశ్చర్యమే. అదే సమయంలో సమస్య తీవ్రతను చాటుతోంది. భవిష్యత్ లో ఉత్పన్నమయ్యే పరిణామాలకు తానొక్కడే కారణం కాదని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ అనుభవం కళ్లెదురుగా ఉన్న తరుణంలో ఉత్పన్నమయ్యే పరిణామాలకు ఉమ్మడి బాధ్యత చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అదే సమయంలో దీపాలు వెలింగించే కార్యక్రమాల ద్వారా వ్యక్తిగత ఛరిష్మా కూడా ఏకకాలంలో పెంచుకునే పనిలో ఉన్నారు.
దేశంలో లాక్ డౌన్ తర్వాత సామాన్య ప్రజలు తీవ్రంగా సతమతం అవుతున్నారు. మొత్తం వ్యవస్థ స్తంభించడంతో కార్పోరేట్ , పారిశ్రామిక వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇక అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరిసలపడం లేదు. ఏప్రిల్ 6వతేదీన గానీ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు జరగడం లేదంటే పరిస్థితి అర్థమవుతోంది. దాదాపుగా అన్ని చోట్లా పరిస్థితి ఇలానే ఉంది. దాంతో లాక్ డౌన్ సడలించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు అనుగుణంగా రవాణా మార్గాల్లో రిజర్వేషన్లు షురూ చేశారు. చివరకు ఏపీఎస్ఆర్టీసీ కూడా రిజర్వేషన్లకు అంగీకరించడంతో ఇక లాక్ డౌన్ సడలింపు జరగబోతోందనే సంకేతాలు బలపడుతున్నాయి. రెడ్ జోన్లు, ఇతర కీలక ప్రాంతాల్లో ఆంక్షల కొనసాగిస్తూ ఇతర ప్రాంతాల్లో యాధావిధిగా అనుమతించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
లాక్ డౌన్ ఎత్తేస్తే ఒక్కసారిగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడం ఖాయం. ఇప్పటికే కేంద్రం కూడా అలాంటి అంచనాలతో ఉంది. ప్రధాని కూడా అలాంటి పరిస్థితిని కట్టడిచేసేందుకు వ్యూహాలు రచించాలని రాష్ట్రాల సీఎంలకు సూచన కూడా చేశారు. అలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి అరికట్టడం ఎలా అన్నదే అంతుబట్టడం లేదు. నిజానికి గత నాలుగు రోజుల్లోనే వెయ్యి కేసులు నమోదయ్యాయి. తబ్లీక్ కారణంగా చెబుతున్నప్పటికీ మొత్తం కేసుల్లో అవి మూడోవంతు కూడా లేవు. ఇతర కేసులు కూడా విస్తృతమవుతున్న తీరుని ఇది చాటుతోంది. 4వేలకు చేరువగా పాజిటివ్ కేసులున్న సమయంలో రాబోయే రెండు వారాలు కీలకం అంటూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కూడా చెబుతున్నారు. అంటే ఏప్రిల్ 20వరకూ దేశంలో కరోనా తాకిడి తగ్గే అవకాశాలు లేవని చెబుతున్నట్టుగా ఉంది. అలాంటి సమయంలో లాక్ డౌన్ విషయంలో తీసుకునే నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్నది ఊహకందని విషయంగా మారుతోంది.
కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సమయంలోనే సామాన్యులను కట్టడి చేయడం చాలా సమస్య అయ్యింది. అలాంటప్పుడు ఏదో మేరకయినా లాక్ డౌన్ లో ఉపశమనం కల్పిస్తే ఇక నియంత్రణ సాధ్యమా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏమయినా ప్రస్తుతానికి ఈ విషయంలో కేంద్రం కూడా రైల్వే, ఎయిర్ లైన్స్ రిజర్వేషన్లకు తలుపులు తెరిచినప్పటికీ తుది నిర్ణయం తీసుకోవడానికి మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. దాంతో లాక్ డౌన్ కి కౌంట్ డౌన్ మొదలయ్యిందా..లేదా అన్నది మోడీ కూడా పలుమార్లు ఆలోచించాల్సిన సమస్యగా తయారయ్యింది. చివరకు తుది నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్ఫెన్స్ గా నే ఉంది.