Idream media
Idream media
‘‘బెంగాల్‌లో బీజేపీ 100 సీట్లకు పైగా గెలిస్తే నేను ఈ వృత్తిని వదిలేస్తా, ఐప్యాక్‌ను కూడా వదిలేస్తా. ఏ ఇతర రాజకీయ ప్రచారంలోనూ నన్ను మీరు చూడబోరు.’’ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
కొన్ని సర్వేలు సైతం పశ్చిమ బెంగాల్ మళ్లీ దీదీదే అని చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ దూసుకెళ్తోంది. బెంగాల్‌పై కూడా దృష్టి పెట్టింది. బెంగాల్ కేంద్రాంగా తన మార్క్ రాజకీయాలతో కొంత కాలంగా అలజడి సృష్టిస్తోంది. టీఎంసీకి చెందిన ఎంతో మంది ప్రముఖులను తన పార్టీలోకి ఆకర్షించింది. అయినప్పటికీ అక్కడ బీజేపీ పాగా వేస్తుందా అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆ పార్టీలోని అంతర్గత కలహాలే అని తెలుస్తోంది.
బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న నాయకత్వానికి కొన్ని ప రిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, మొదటినుంచీ బీజేపీలో ఉన్నవారికి పశ్చిమ బెంగాల్‌లో పొసగడం లేదట. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పైకి చెబుతున్నా.. నేతల మధ్య విభేదాలు చివరికి పార్టీ అవకాశాలను దెబ్బతీస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది. బెంగాల్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం గత అసెంబ్లీ ఎన్నికల నుంచే దృష్టి పెట్టడం, రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ముమ్మరం చేయడం తెలిసిందే.
Also Read:ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే
ఈ క్రమంలోనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో తృణమూల్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సహా పెద్దసంఖ్యలో నేతలు బీజేపీలో చేరారు. ఇతర పార్టీలకు చెందిన మరో నలుగులు ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన నేతలకు ప్రాధాన్యం కల్పించేందుకు బీజేపీ అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలు మొదటినుంచీ ఉన్న నేతలకు నచ్చడంలేదు. దీనిపై వారు పలుమార్లు బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు.
తృణమూల్ మాజీ ఎంపీ అనుపమ్ హజ్రా గతేడాది సెప్టెంబరులో బీజేపీలో చేరగా.. పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హాను ఆ బాధ్యతల నుంచి తొలగించి.. ఆ స్థానంలో హజ్రా నియమించారు. దీనిపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు కమలం నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఏకంగా తృణమూల్ మాజీ నేతల చేరికను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. నేతల మధ్య అంతర్గత కలహాలకు సంబంధించి ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక అభ్యర్థులను ప్రకటిస్తే ఇవి మరెంత దూరం వెళతాయోనని బీజేపీ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
తృణమూల్ నుంచే వచ్చిన సువేందు అధికారి.. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాలకూ టికెట్లను తనతోపాటు బీజేపీలో చేరిన తన అనుయాయులకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని, ఇలాంటివే మరికొన్ని చోట్ల ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఇన్నాళ్లూ అధికార తృణమూల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతూ వచ్చిన తాము.. ఇప్పుడు అదే పార్టీ నేతలను చేర్చుకుంటుండడంతో తమ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుందేమోనన్న సందేహాన్నీ వ్యక్తం చేశారు.
Also Read:గంటా చేరికకు అంతా సిద్ధం…?
ఓవైపు బీజేపీ అంతర్గత కలహాలతో సతమతమవుతుండగా.. మమతా బెనర్జీకి మాత్రం వివిధ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆర్జేడీ, సమాజ్‌వాది పార్టీలు తృణమూల్‌కు తమ మద్దతు ప్రకటించగా.. తాజాగా శివసేన, ఎన్సీపీ కూడా మమతకు జైకొట్టాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టబోమని, పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించిన అనంతరం మమతకు మద్దతివ్వాలన్ని నిర్ణయం తీసుకున్నామని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్‌రౌత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. మమతకు వ్యతిరేకంగా అన్ని శక్తులూ పనిచేస్తున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ఆమెకు అండగా నిలుస్తామని తెలిపారు. మమతే నిజమైన బెంగాల్ పులి అని అభివర్ణించారు. శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మమతకు మద్దతు ప్రకటించింది. శివసేన, ఎన్సీపీల నిర్ణయాన్ని తృణమూల్ స్వాగతించింది. ఆర్జేడీ, సమాజ్‌వాది, శివసేనలకు బెంగాల్‌లో ఎటువంటి బలం లేదని, వారి మద్దతుతో ఒరిగేదేమీ ఉండదని బీజేపీ పేర్కొంటోంది.