గంటా చేరికకు అంతా సిద్ధం...?

By Raju VS Mar. 05, 2021, 07:30 am IST
గంటా చేరికకు అంతా  సిద్ధం...?

గంటా శ్రీనివాసరావు. ఇప్పటికే టీడీపీ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్, మళ్లీ టీడీపీలోకి మారిన తర్వాత ప్రస్తుతం ఆపార్టీకి కూడా దూరంగా ఉంటున్న నాయకుడు. ఈ మాజీ మంత్రికి పార్టీలు , నియోజకవర్గాలు మార్చడం వెన్నతో పెట్టిన విద్య అన్నది అందరికీ విదితమే.

మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీకి ఆయన క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరిగింది. చివరకు బీజేపీ హస్తిన పెద్దల సమక్షంలో ఆయన హఠాత్తుగా ప్రత్యక్షం కావడం కూడా చర్చనీయాంశం అయ్యింది. చివరకు ఏమయినా రెండేళ్లుగా అటు టీడీపీకి దూరంగా ఉంటూ, ఇటు ఏపార్టీకి దగ్గర కాలేక ఆయన అటూ ఇటూ కాని స్థితిలో ఉన్నారు. అదే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా మొదలయిన ఉద్యమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకుని తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్ ఫార్మేట్లో లేఖ పంపించారు. దానిపై ఎటువంటి నిర్ణయం ఇంకా వెలువడలేదు.

అదే సమయంలో గంటా అనుచరులంతా వైఎస్సార్సీపీ వైపు క్యూ కట్టడం ఆసక్తికరంగా మారింది. మరో మాజీ మంత్రి నారాయణకు వియ్యంకుడైన గంటా తన కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం ఏదో పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు అంతా భావిస్తున్నారు.. అందుకు అనుగుణఃగా వైఎస్సార్సీపీలో చేరేందుకు ఆయన పలు ప్రయత్నాలు చేసినా ఆపార్టీ ప్రధాన నాయకత్వం మొగ్గు చూపకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఒకనొక సందర్భంలో గంటా చేరికకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మంత్రి అవంతి బహిరంగంగానే ప్రకటించారు. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా గంటా ప్రయత్నాలు చేయగా, అవంతి శ్రీనివాస్ వంటి కొందరు అడ్డుపుల్ల వేయడంతో అది ముందుకు సాగలేదనే వాదన ఉంది.

తాజాగా జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ వైసీపీలో చేరిన సందర్భంలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశం అయ్యింది. త్వరలోనే సీఎం అంగీకరిస్తే గంటా కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటారని ఆయన ప్రకటించారు. దాంతో మళ్లీ గంటా చేరిక ప్రయత్నాలు ఊపందుకుంటున్నట్టు పలువురు భావిస్తున్నారు. సీఎం అంగీకారం కోసం చూస్తున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కీలకంగా కనిపిస్తోంది. త్వరలోనే గంటాకి అడ్డంకులన్నీ తొలగిపోయి, ఆయన చేరేందుకు గంట కొడతారని భావిస్తున్నారు.

అయితే విజయసాయిరెడ్డి ప్రకటనకు కొద్ది సేపటి తర్వాత గంటా కూడా తాను పార్టీ మారితే అందరితో చెప్పే మారుతానని చేసిన వ్యాఖ్యలు కూడా గమనార్హం. విజయసాయిరెడ్డి ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో నాకైతే తెలియదు గానీ, నేను పార్టీ మారే నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ ఆయన తేల్చేశారు. దాంతో గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం మరో మలుపు తీసుకునే సమయం ఆసన్నమయ్యిందా అనే ప్రచారం జోరందుకుంది. ఎటువంటి పరిణామాలు జరిగినా జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఆశల సౌథాలు కూలిపోతున్న తరుణంలో అది విశాఖ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp