iDreamPost
iDreamPost
పశ్చిమ బెంగాల్లో అసలు ఆట ఇప్పుడు మొదలైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారం చేజిక్కించుకోలేకపోయామన్న ఉక్రోశంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా బీజేపీ మమతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే.. బీజేపీపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న దీదీకి గతంలో కాషాయ కండువా కప్పుకున్న నేతల్లో చాలామంది తిరిగి తన పంచన చేరేందుకు ఉవ్విళ్లూరుతుండటం ఆమెకు కలిసివచ్చేలా ఉంది. ఈ పరిణామాలన్నీ బెంగాల్ రాజకీయ క్రీడ ఎన్నికలతోనే ముగిసిపోలేదని.. అసలు ఆట ఇప్పుడే మొదలైందన్న సంకేతాలు ఇస్తున్నాయి.
సీఎస్ పై చర్యలు తథ్యమేనా
యస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల సందర్శన, అనంతరం కలైకుండాలో ప్రధాని నిర్వహించిన సమీక్ష సమావేశం నాటి పరిణామాలపై బీజేపీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై తాజాగా వివరణ ఇచ్చాయి. ప్రధాని సమావేశానికి వెళ్లిన తనను భద్రత అధికారులు నిరీక్షించేలా చేశారన్న మమత ఆరోపణల్లో వాస్తవం లేదని.. ప్రధాని ఆ సమావేశానికి మధ్యాహ్నం 1.59 గంటలకు వస్తే.. మమత 2.10కి వచ్చారని పేర్కొన్నారు. అలాగే ప్రధాని అనుమతితోనే తాను త్వరగా వెళ్లానని మమత చెప్పడాన్ని ఖండిస్తూ సమావేశం నుంచి వెళ్లేందుకు ఆమెకు ప్రధాని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
కాగా సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ కూడా వెళ్లిపోవడం ప్రోటోకాల్ కు విరుద్ధమని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. తక్షణమే రిలీవ్ అయి ఢిల్లీలో రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలను ఖాతరు చేయకుండా పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే ప్రభుత్వ సలహాదారుగా నియామకం పొందడం అఖిలభారత సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని.. అందువల్ల బందోపాధ్యాయ క్రమశిక్షణ చర్యలకు అర్హుడేనని స్పష్టం చేశారు. ఆయనపై చర్యలు తప్పవని సంకేతమిచ్చినా.. ఎటువంటి చర్యలు తీసుకుంటారో క్లారిటీ ఇవ్వలేదు.
రివర్స్ వలసలు
మరోవైపు రాజకీయంగానూ బెంగాల్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్న హైప్ క్రియేట్ చేసి.. తృణమూల్ కు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులను ప్రలోభపెట్టి కాషాయ కండువాలు కప్పేశారు. కానీ వారు అనుకున్నది జరగలేదు. అధికారం దక్కలేదు. మమత బంపర్ మెజారిటీతో మళ్లీ కొలువుదీరారు.
దీంతో నేరకపోయి బీజేపీలోకి వెళ్లామని ఫిరాయింపు నేతలు మధనపడుతున్నారు. ఇప్పటికే నలుగురు మమత శరణు వేడుతూ బహిరంగ ప్రకటనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ అయితే.. మమతకు దూరంగా ఉండలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. టీఎంసీ నుంచి వలసలకు ఆద్యుడైన ముకుల్ రాయ్ మాతృ సంస్థలోకి తిరిగి వచ్చేందుకు సంకేతాలు ఇచ్చారు.
ఫుట్ బాల్ క్రీడాకారుడు, మాజీ ఎమ్మెల్యే దీపేందు బిస్వాస్, సరళ ముర్ము, అమలు ఆచార్య తదితరులు కూడా దీదీ అనుమతిస్తే పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీకి చెందిన ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నలుగురు సిట్టింగ్ ఎంపీలు కూడా టీఎంసీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారని తృణమూల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీజేపీపై రాజకీయ ప్రతీకారం తీర్చుకొనేందుకు ఎదురుచూస్తున్న దీదీ ఈ వలసలను అనుమతిస్తారా.. పార్టీ గేట్లు తెరిచి బీజేపీని దెబ్బకొడతారా.. అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మమత గానీ, టీఎంసీ నేతలు గానీ దీనిపై ఇంతవరకు స్పందించలేదు.
Also Read : సుధాకర్, రఘురామరాజు.. ఇక జడ్జి రామకృష్ణ వంతు..!