iDreamPost
android-app
ios-app

అచ్చెన్న అరెస్టుకు బిసిలకు సంబంధం లేదు… తేల్చి చెప్పిన బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

  • Published Jun 15, 2020 | 3:39 AM Updated Updated Jun 15, 2020 | 3:39 AM
అచ్చెన్న అరెస్టుకు  బిసిలకు సంబంధం లేదు… తేల్చి చెప్పిన బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇపుడిదే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఎప్పుడైతే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అవినీతి ఆరోపణలపై ఏసిబి అధికారులు అరెస్టు చేశారో వెంటనే సామాజికవర్గాల గోల మొదలైపోయింది. అచ్చెన్న అరెస్టును బిసిలంతా ఖండించాలంటూ చంద్రబాబునాయుడు గోల మొదలుపెట్టేశాడు. అచ్చెన్నను అరెస్టు చేయటమంటే బిసిలను అవమానించటమే అంటూ సామాజికవర్గాన్ని చంద్రబాబు, చినబాబుతో పాటు టిడిపి నేతలంతా రెచ్చగొడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ అసలు అచ్చెన్న అరెస్టుకు బిసి సామాజికవర్గానికి సంబంధం ఏమిటి ? అనే ప్రశ్న మొదలైంది.

ఏపి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ అచ్చెన్న అరెస్టుకు బిసి సామాజికవర్గానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు. ఇఎస్ఐ కుంభకోణంలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై ఏసిబి అరెస్టు చేసింది కాబట్టి వ్యక్తిగత హోదాలో అచ్చెన్నే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటూ శంకర్ స్పష్టం చేశారు. అచ్చెన్న బిసి సామాజికవర్గం ప్రయోజనాల కోసం పోరాటం చేసి అరెస్టు కాలేదన్న విషయాన్ని బిసిలు గ్రహించినట్లు ఆయనన్నారు. బిసిల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నపుడు అచ్చెన్న అరెస్టయితే సామాజికవర్గాలు ఆయన వెంట కచ్చితంగా ఉంటాయన్నారు.

నిజం చెప్పాలంటే అచ్చెన్నను సామాజికవర్గ ద్రోహిగానే బిసిలంతా చూస్తున్నారని కూడా చెప్పారు. బిసిల కోటాలో మంత్రివర్గంలో స్ధానం సంపాదించుకున్న అచ్చెన్నాయుడు సామాజికవర్గం ప్రయోజనాల కోసం ఏరోజు పని చేయలేదని కూడా అభిప్రాయపడ్డారు. అచ్చెన్న కోసం బిసిలంతా రోడ్లపైకి రావాలని, ఉద్యమాలు చేయాలని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇచ్చిన పిలుపుని సామాజికవర్గంలోని ఎవరూ పట్టించుకోవటంలేదని కూడా స్పష్టం చేశాడు.

అధికారంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడిన వాళ్ళు తర్వాత విచారణను ఎదుర్కోవాల్సొచ్చినపుడు, అరెస్టయినపుడు సామాజికవర్గాన్ని అడ్డం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు బిసి సంఘాల నేతలను ఎంతగా అవమానించింది ఇప్పటికీ తమ సామాజకవర్గం మరచిపోలేదని ఆయన గుర్తుచేశాడు. అచ్చెన్నను కాపాడుకోవాలంటే పార్టీ పరంగా టిడిపి ప్రయత్నాలు చేసుకోవాలే తప్ప సామాజికవర్గాన్ని లాగటాన్ని బిసిలు ఎవరూ అంగీకరించటం లేదని కూడా చెప్పారు.

అచ్చెన్న అరెస్టు విషయంపై తనతో చాలామంది సామాజికవర్గంలోని ప్రముఖులు మాట్లాడుతూ మాజీమంత్రి అరెస్టు వ్యవహారాన్ని టిడిపి చూసుకోవాలే కానీ బిసి సంఘాలకు ఎటువంటి సంబంధం లేదని అభిప్రాయపడ్డారని చెప్పారు. శంకర్ చెప్పిన విషయలను బట్టి చంద్రబాబు బిసిలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫెయిలవుతున్నట్లు అర్ధమైపోతోంది. అచ్చెన్న అరెస్టుకు వ్యతిరేకంగా అంబేద్కర్, జ్యోతిరావుపూలె విగ్రహాలకు బిసిలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలన్న చంద్రబాబు పిలుపు చివరకు పెద్ద డ్రామాగా మాత్రమే మిగిలిపోతాయని అర్ధమవుతోంది.