iDreamPost
android-app
ios-app

బీసీల సం‘క్రాంతి’

బీసీల సం‘క్రాంతి’

ఏపీలో బీసీలకు సంక్రాంతి పండగ ముందే వచ్చింది. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌క్లాస్‌ అని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారికి సామాజికంగా ఆర్థికంగా మేలు చేయడమే కాదు.. రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో కూర్చొబెట్టారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే వారికి చెంప చెల్లుమనిపించేలా.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీ కులాలకు భారీ సంఖ్యలో కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఇప్పటి వరకు ఒకే ఒక కార్పొరేషన్‌ ఉండగా.. దాని స్థానంలో 56 కార్పొరేషన్లను వైసీపీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. ఆయా కార్పొరేషన్లకు చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించింది. వారందరూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఈ వేడుకకు వేదికగా నిలవబోతోంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరవుతున్నారు.

139 బీసీ కులాలకు వైసీపీ సర్కార్‌ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసింది. వైసీపీ మంత్రివర్గంలోనూ ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు 60 శాతంపైగా ఉన్నారు. బీసీ కార్పొరేషన్లలోనే గాక.. వ్యవసాయ మార్కెట్‌కమిటీలు, ఇతర నామినేటెడ్‌ పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. నోటి మాట ద్వారా కాకుండా చట్టం చేసి తన చిత్తశుద్ధిని సీఎం జగన్‌ చాటుకున్నారు. రాజకీయంగానే కాకుండా కాంట్రాక్ట్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ.. మహిళా సాధికారత అంటే ఏమిటో చూపిస్తున్నారు.

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటును అవహేళన చేస్తూ చైర్మన్లకు కుర్చి కూడా వేయలేరన్న ప్రతిపక్ష పార్టీ నాయకుల చెంపచెల్లుమనిపించేలా.. వారందరికీ జీతభత్యాలను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. చైర్మన్లకు జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, నలుగురు సిబ్బంది జీతాలకు కలిపి నెలకు 2.34 లక్షల రూపాయలను చెల్లిస్తోంది. ఇందులో చైర్మన్‌/చైర్‌ పర్సన్‌జీతం 65 వేలుగా నిర్ణయించారు. ఇక డైరెక్టర్లకు నెలకు 14 వేల రూపాయలు జీతం చెల్లిస్తున్నారు. అక్టోబర్‌ 18వ తేదీన కార్పొరేషన్లకు పాలకమండళ్లను ఏర్పాటు చేయగా.. నవంబర్‌ నెల నుంచే వారికి జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఈ రోజు అన్ని కార్పొరేషన్ల పాలకమండళ్లు ప్రమాణస్వీకారం చేయబోతున్నాయి.