iDreamPost
android-app
ios-app

గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

గంటా  ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

తాజాగా ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు రుణాల ఎగవేత వ్యవహారం కలకలంగా మారింది. ఏప్రిల్ 16 వ తేదీన మాజీ మంత్రి ఘంటా కు సంబందించిన ఆస్తులను ఈ-వేలం వేయనున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. వేలంలో సదరు ఆస్తులు కొనాలనుకొనేవారు ఈ రోజు నుండి వచ్చే నెల 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కు చెందిన ప్రత్యుషా కంపెనీ ఇండియన్ బ్యాంక్ వద్దనుండి 142 కోట్ల రూపాయల ఋణం తీసుకుంది. అయితే వడ్డీతో సహా ఆ అప్పు 221 కోట్లకు చేరుకుంది. దీనితో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకుండా ఘంటా ఋణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ సదరు ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రత్యుషా కంపెనీలో ఘంటా తో సహా ఏడుగురు డైరెక్టర్ల ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ప్రత్యుషా రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ పేరిట ఘంటాకు చెందిన కంపెనీ ఉద్దేశపూర్వకంగానే ఋణం ఎగవేసిందని ఆరోపిస్తూ గత నవంబర్ లోనే ఇండియన్ బ్యాంక్ సదరు కంపెనీకి రెండోసారి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు ఘంటా సమాధానం ఇవ్వకపోవడంతో నేరుగా బ్యాంక్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. కంపెనీలో డైరెక్టర్లయిన ఘంటా శ్రీనివాసరావు, పి రాజారావు, పివి ప్రభాకర రావు, నార్నె అమూల్య, కెవి సుభ్రమణ్యంలు బ్యాంక్ వేలం నోటీసులు అందజేసింది.

ఇటీవల కాలంలో ఘంటా శ్రీనివాసరావు కోవలోనే తెలుగుదేశంలో ముఖ్యపాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతలు ఇలా వరుసగా బ్యాంక్ ఋణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఋణం ఎగవేత కేసులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ప్రముఖ దిగ్గజ బ్యాంకులైన విజయ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ లు ప్రకటించాయి. అదేవిధంగా విశాఖపట్టణానికే చెందిన మరో తెలుగుదేశం నాయకుడు, నారా లోకేష్ తోడల్లుడు భరత్ కు సంభందించిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఇటీవలే మరో సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ కావూరి సాంబశివ రావు కూడా వేలం నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలువురు తెలుగుదేశం నేతలు బ్యాంక్ లను బెదిరించి అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున ఋణాలు పొందినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారం కోల్పోయాక తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి వ్యవహారం బయటపడుతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ముందు ముందు ఇదే తరహాలో గతంలో బ్యాంక్ లనుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న మరెందరి బండారం బయటపడుతుందో చూడాలి.