iDreamPost
android-app
ios-app

మహారాష్ట్రలో వలస కార్మికుల ఆందోళన.. ముంబైలో రైల్వే స్టేషన్ ముట్టడి..

మహారాష్ట్రలో వలస కార్మికుల ఆందోళన.. ముంబైలో రైల్వే స్టేషన్ ముట్టడి..

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు లాక్ డౌన్ ముగియడం, చివరి రోజున గడువును పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం ప్రజలకు చేరడం లో ఆలస్యం అవడంతో ముంబైలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ ముగిసిందనే భావనతో ముంబైలో వలస కార్మికులు అందరూ తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బాంద్రా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దాదాపు 1500 మంది వలస కార్మికులు రైల్వేస్టేషన్కు రావడం తో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

లాక్ డౌన్ పొడిగింపు విషయం చెప్పిన పోలీసులు.. తిరిగి వెళ్లాలని సూచించినా వలస కార్మికులు వినిపించుకోలేదు. తమకు పునరావాసం కల్పించడం సమస్యకు పరిష్కారం కాదని, తమను తమ తమ స్వస్థలాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు. లాక్ డౌన్ అమలు ఉల్లంఘించి తమను ఇబ్బంది పెట్టవద్దని తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు చేసిన సూచనను కూడా వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వలస కార్మికులను చెదరగొట్టారు. కార్మికులందరూ వెళ్లిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ పరిధిలో ప్రాంతాలను శానిటైజేషన్ చేశారు.

బాంద్రా రైల్వే స్టేషన్ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. అధికార శివసేన పార్టీ, ప్రతిపక్ష బిజెపి పార్టీ ల మధ్య విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వివరణ ఇచ్చారు. మీ ఇష్టం లేకుండా ఎవరు మీరు ఇక్కడ ఉండాలని భావించడం లేదని, ఇది లాక్ డౌన్ తప్పా.. లాకప్ కాదని వలస కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది మన దేశ మని, మహారాష్ట్రలో మీరు పూర్తి సురక్షితంగా ఉంటారని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వలస కార్మికులకు ఆయన భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ ఎత్తివేసే రోజున తాను మాత్రమే, కాదని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

కాగా బాంద్రా ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు సీఎం ఉద్ధవ్ సూచించారు. నేటితో లాక్ డౌన్ ఎత్తి వేశారని, రైళ్ల రాకపోకలు మొదలయ్యాయనే పుకార్లు నమ్మడం వల్లే వలస కార్మికులంతా రైల్వే స్టేషన్ బాట పట్టారని సీఎం పేర్కొన్నారు. కాగా సాయంత్రం వలస కార్మికులు అందర్నీ పోలీసులు చెదరగొట్టినా.. తిరిగి వారు రాత్రికి రైల్వే స్టేషన్ ప్రాంగణానికి చేరుకోవడం గమనార్హం. తమను తమ ప్రాంతాలకు పంపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.