iDreamPost
iDreamPost
రాయలసీమ ప్రజాప్రతినిధిగా ఉన్న సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రాజధానుల విషయంలో స్పందించిన తీరు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నుంచి ఆయన ప్రాతినిత్యం వహిస్తున్నా.. రాయలసీమ నుంచి ఎన్నికైన నేతగా ఆయనకు కనీసం సీమ ప్రజలపై అభిమానం ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కోరిక ఉండాలి. ఇవన్ని ఉంటే మూడు రాజధానుల్లో భాగంగా రాయలసీమలో హైకోర్టు పెడతామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంటే రాజధాని మొత్తం ఒకే చోట ఉండాలన్న తెలుగుదేశం వైఖరిని ఆయన వ్యతిరేకించాలి..
అనంతపురం జిల్లా తన నియోజకర్గమైన హిందూపురంకి వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు అడ్డుకున్నారు. సీమ నుంచి ఎన్నికై ఉండి కూడా రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడటం లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత ఎన్.టి. రామారావు మూడు సార్లు, హరిక్రిష్ణ ఒకసారి, వరుసగా రెండవ సారి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు నందమూరి కుటుంబానికి పట్టం కట్టిన ప్రజలు మూడు రాజధానుల అంశంలో బాలకృష్ణను అడ్డుకున్నారంటే ఆవేశంతో ఊగిపోతున్నారే తప్ప.. ఆవేధనతో అడ్డుకున్నారని గుర్తించడం లేదు.
తాను సైగ చేస్తే ఏమై ఉండేదో అని తన పర్యటనను అడ్డుకోవడంపై మాట్లాడిన బాలకృష్ణ.. రాయలసీమలో అభివృద్ధిని అడ్డుకుంటున్నానని తెలుసుకోవాలి. ఆ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ప్రజలు కేవలం నిరసన తెలిపారు. ఇప్పటికైనా బాలకృష్ణ తేరుకొని తన పార్టీ గురించే కాకుండా.. తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అప్పుడే తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వెనుకబడిన రాయలసీమకు ఏం చేసిందో తెలుస్తుంది.. వైసీపీ వచ్చిన తర్వాత ఏం చేయబోతుందో అర్థమవుతుంది..