iDreamPost
android-app
ios-app

టాలెంటెడ్ డైరెక్టర్ ఇక లేరు

  • Published Jun 18, 2020 | 8:24 PM Updated Updated Jun 18, 2020 | 8:24 PM
టాలెంటెడ్ డైరెక్టర్ ఇక లేరు

కరోనా లాక్ డౌన్ వల్ల ఒకపక్క థియేటర్లు షూటింగులు ఆగిపోయి సినిమా పరిశ్రమ అతలాకుతలం అవుతుంటే మరోపక్క ప్రముఖుల మరణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్న జరిగిన సుశాంత్ రాజ్ పుత్ ఘటన మరవకముందే ఇవాళ టాలెంటెడ్ డైరెక్టర్ కన్ను మూశారు. మలయాళంలో స్క్రీన్ రైటర్ గా దర్శకుడిగా గొప్ప పేరున్న కెఆర్ సచిదానందన్ అలియాస్ సచీ గత కొద్దిరోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ త్రిసూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన సచీ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కానీ పరిస్థితి విషమంగా మారడంతో జూబ్లీ మిషన్ హాస్పిటల్ లో చివరి శ్వాస తీసుకున్నారు.

ఇటీవలి కాలంలో సౌత్ లో బాగా వినిపించిన హిట్ మూవీ అయ్యప్పనుం కోశియుమ్ దర్శకులు ఈయనే. తెలుగులోనూ ఇది త్వరలో రీమేక్ కాబోతోంది. సంచలనం రేపిన మరో సినిమా డ్రైవింగ్ లైసెన్స్ కు రచన అందించింది కూడా సచీనే. బ్రిలియంట్ రైటర్ గా పేరున్న సచీ ఈ విభాగంలో మోస్ట్ టాలెంటెడ్ గా పేరుపొందిన డైరెక్టర్లు కూడా అంగీకరిస్తారు. కెరీర్ ప్రారంభంలో సేతు అనే మరో రచయితతో కలిసి జాయింట్ గా సినిమాలు చేసిన సచీ ఈ కాంబినేషన్ లో చాలా హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత 2012లో స్నేహితుడి నుంచి విడిపోయి రన్ బేబీ రన్ నుంచి ఇండిపెండెంట్ రైటర్ గా కొత్త ప్రస్థానం మొదలుపెట్టారు.

దర్శకుడిగా 2015లో అనార్కలితో మెగా ఫోన్ చేపట్టారు. సేతుతో సహదర్శకత్వంలో ఉన్నప్పుడు 5 సినిమాలు చేసిన సచీ సోలోగా రెండు మాత్రమే డైరెక్ట్ చేశారు. అయ్యప్పనుం కోశియుం తర్వాత ఈయన డిమాండ్ విపరీతంగా పెరిగింది. చెట్టాయీస్, రామలీల, షెర్లాక్ హోమ్స్ లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఈయనకు రైటర్ గా చాలా పేరు తీసుకొచ్చాయి. పృథ్విరాజ్ తో మంచి అనుబంధం ఉన్న సచీ ఆయనతోనే ఎక్కువ సినిమాలు చేయడం విశేషం. త్వరలో మరో భారీ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేసుకున్న సచీ అనూహ్యంగా అనారోగ్యం వల్ల కన్నుమూయడం కేరళకే కాదు యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటే. కథలు చెప్పడంలో ఎమోషన్స్ ని తెరపై బలంగా చూపడంలో పేరున్న సచీ ఇలా కన్నుమూయడం విచారకరం.