పెద్ద హీరో సినిమాలో కాసేపైనా కనిపించడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న కాంపిటషన్ లో అది ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. ఇక పోస్టర్ మీద మెయిన్ హీరోయిన్ లేకుండా హీరోతో పాటు సోలో పోస్టర్లో కనిపించడం అంటే అది పెద్ద సక్సెస్సే అని చెప్పాలి. మనం చెప్పుకుంటున్నది నివేతా పేతురాజ్ గురుంచి. యువ ప్రేక్షకులు చాలామందికి ఈమె పరిచయమే కానీ ఇప్పుడు “అల వైకుంఠపురం” దెబ్బకి ఈమె ఫ్యామిలీ ప్రేక్షకులకి కూడా పరిచయం అయ్యింది. “మీది అబ్బో అనేంత అందం కాకపోయినా చాలా సెక్సీగా ఉంటారండి” అని ఈ అమ్మాయి మీద సాక్షాత్తు అల్లు అర్జున్ చేత అనిపించిన ఒక డయలాగ్ కూడా ఉంది ఇందులో. అది చాలు ఈమెకి త్వరలోనే స్టార్డం చాన్స్ ఉందని నమ్మడానికి. ప్రస్తుతం తయారీలో ఉన్న రాం సినిమా “రెడ్” లో కూడా కనిపించబోతోంది. పుటుకతో తమిళియన్ అయిన ఈమె నివాసం దుబాయిలో. తమిళ్, తెలుగు, హింది, ఇంగ్లీష్, అరబిక్ భాషలు మాట్లాడగలదు.
ఇంతకీ నివేత పేతురాజ్ మన రాజ్ కందుకూరి నిర్మించిన “మెంటల్ మదిలో” సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. తర్వాత “చిత్రలహరి”, “బ్రోచేవారెవరురా” లో కనిపించింది. ఆ మూడు సినిమాలు బాక్సీఫీసు వద్ద సక్సెస్ అయినవే. ఈ సక్సెస్ సెంటిమెంటు కూడా ఈ అమ్మాయికి బాగా పనిచేసి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం. సెంటిమెంట్ మీద నడిచే ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ కాన్సెప్ట్ ఉండనే ఉంటుంది.
బన్నీ సినిమాలో చెప్పినట్టు ఈ అమ్మాయి చాలామందికి సెక్సీగా కనిపించడం వల్ల యువకుల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈమె సీరియస్ రోల్స్ కే పరిమితం అవుతుందా, రెగ్యులర్ హీరోయిన్స్ లాగ గ్లామర్ ఒలకబోసే అవకాశం ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. స్టార్ డం రావాలంటే మాత్రం గ్లామర్ షో తప్పదని విడిగా చెప్పక్కర్లేదు. లేకపోతే నివేతా థామస్, కీర్తి సురేష్, నిత్యా మీనన్ స్థాయిలో మంచి నటి అనిపించుకుని ఆగుతుందా చూడాలి.