Idream media
Idream media
అమెరికాలో మహాత్ముని విగ్రహంపై దాడి జరిగింది. ఇటీవలి అమెరికాలో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసన తెలుపుతున్న ఆందోళన కారుల్లో కొంత మంది చొరబడి కార్లు ధ్వంసం చేయడం, షాపులను లూటీ చేయడం వంటి హింసాత్మక ఘటనలకు తెరలేపినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొందరు దుండగులు మహాత్ముని విగ్రహం ధ్వంసం చేసిశారు.
నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరిక పార్క్ పోలీసు అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే.
కాగా, నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోసినట్లు అయింది. అప్పటికే ఆందోళనను శాంతియుతంగా నిర్వహిస్తున్న నల్లజాతీయులు, ట్రంప్ వ్యాఖ్యలతో తమ ఆందోళనలను ఉధృతం చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే ఈ నేపధ్యంలో ఆందోళనకారుల్లో కొంత మంది విద్వేషకారులు చొరపడి ఆందోళనలను హింసాత్మకం చేస్తున్నారు.
అయితే అమెరికాలో మహాత్ముని విగ్రహం ధ్వంసం జరిగిన ఘటనపై భారతదేశంలోని అమెరికా రాయబారి కె.న్ జస్టర్ స్పందిస్తూ ”వాషింగ్టన్ డిసిలోని మహాత్మ గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించండి. దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండి” కోరారు.