iDreamPost
android-app
ios-app

ఇంత జరిగినా దిగ్విజయ్ సింగ్ కే మరోసారి పదవి

ఇంత జరిగినా దిగ్విజయ్ సింగ్ కే మరోసారి పదవి

మధ్యప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంకృత అపరాధమే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ విషయంలో అన్ని వేళ్ళు కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతనే ఎత్తి చూపుతున్నాయి. కష్టకాలంలో పార్టీలో సంస్థాగతంగా స్థానిక యువనాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీకి జవసత్వాలు కల్పించాల్సింది పోయి, ఎంతసేపటికి భజనపరులకే ప్రాధాన్యమిస్తూ వారినే అందలం ఎక్కించడం వల్లనే పార్టీ కి ఈ దుస్థితి దాపురించిందని సాక్షాత్తు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలే ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ గుణపాఠం నేర్చుకోకపోవడం ఆ పార్టీ అధిష్టానం నిర్లిప్తతకు అద్ధం పడుతుందని ఆ విషయంలో వారు అధిష్టానం తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

మధ్యప్రదేశ్ సంఘటనే తీసుకుంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ వరుసగా మూడు పర్యాయాలు ఓటమి పాలయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులనుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఓటమి చవి చూడక తప్పలేదు. అయినా బొటాబొటీ మెజారిటీతో 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ లో రాకరాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా తన ‘ట్రేడ్ మార్క్’ గ్రూప్ రాజకీయాల సంస్కృతీ మార్చుకోక పోవడం చూస్తుంటే.. తమ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని పార్టీ సమర్ధించుకొనే ప్రయత్నం చేసినప్పటికీ గ్రూప్ రాజకీయాలపై పూర్తి పేటెంట్ హక్కులు ఆ పార్టీకే చెందుతాయని చెప్పక తప్పేట్టు లేదు!!. తాజాగా మధ్యప్రదేశ్ ఉదంతంలో గ్రూప్ రాజకీయాల నేపథ్యంలోనే ఆ రాష్ట్ర యువతలో మంచి ఫాలోయింగ్, ప్రజాదరణ ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ని కాదని మరో సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ని ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పట్లో రాహుల్ ఈ విషయంలో సింధియాను ఎలాగో ఒప్పించాడు కూడా.

అయితే సమస్య అంతా ఇక్కడే మొదలైంది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సింధియా వర్గానికి చెందిన ఆరుగురికి మంత్రి పదవులు లభించినప్పటికీ, పార్టీ లో ఉన్న అంతర్గత వర్గ పోరు నేపథ్యంలో ప్రభుత్వానికి అధినేత కమల్ నాథ్ అయినప్పటికీ, బ్యాక్ డోర్ లో మాత్రం వ్యవహారాలన్నీ ద్విగ్విజయ్ సింగ్ నడపడం మొదలుపెట్టాడు. దీనితో ఉద్దేశపూర్వకంగానే జ్యోతిరాదిత్యా వర్గం పై వివక్ష చూపడం మొదలైంది. అది ఏ స్థాయికి వెళ్లిందంటే, సింధియా వర్గానికి చెందిన మంత్రులెవరికీ ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో స్వేచ్ఛ లేకుండా పోయింది. పదవులు, అధికారుల బదిలీల విషయంలో సింధియా వర్గం పంపిన ఫైళ్లని అన్నింటిని సీఎం ఆఫీసులో కదలకుండా తొక్కి పెట్టడం మొదలైంది. దీనితో జ్యోతిరాదిత్యా బాహాటంగానే అనేకసార్లు కమల్ నాథ్, ద్విగ్విజయ్ ల పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

2019 లో జరిగిన పార్లమెంట్ లో సింధియా గుణ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఓటమి చెందడం తో పార్టీలో గ్రూప్ లు మధ్య విభేదాలు తారాస్థాయి కి చేరాయి. దీనిపై సింధియా అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేసిన ఫలితం లేకుండా పోయింది. ఒకదశలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీ రైతు రుణమాఫీ విషయంలో కమల్ నాథ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోకపోతే తానూ రైతులతో కలసి రోడ్లపై ధర్నా చేస్తానని సింధియా హెచ్చరించినప్పటికీ, కమల్ నాథ్ మాత్రం సింధియా నిరభ్యంతరంగా రోడ్లమీద ధర్నా చేసుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో సింధియా రగిలిపోయాడు. కమల్ నాథ్ ఇలా మాట్లాడడం వెనుక పార్టీ అధిష్టానం మద్దతు ఉందని సింధియా భావించారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం సింధియా ని పిలిచి మాట్లాడింది లేదు.

ఇదే సమయంలో వచ్చిన రాజ్యసభ ఎన్నిలకలు అగ్నికి ఆజ్యం పోశాయి. మధ్య ప్రదేశ్ నుండి కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఒక స్థానాన్ని మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కేటాయించగా మరో స్థానాన్ని కమల్ నాథ్ కు అత్యంత సన్నిహితుడయియినా పూల్ సింగ్ బరయా కి కేటాయించింది. జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభ స్థానం ఆశించినప్పటికీ అతనికి మొండి చెయ్యి చూపిన కాంగ్రెస్ ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. పార్టీలోని అంతర్గత విషయాలని సోనియా దృష్టికి తీసుకెళ్లడానికి ఫిభ్రవరి 26 న సింధియా సోనియా గాంధీతో కలవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె అపాయింట్మెంట్  లభించలేదు. అదేసమయంలో స్వయంగా మోడీ , అమిత్ షా ల నుండి ఆహ్వానం అందడంతో సింధియా కాంగ్రెస్ తో తనకున్న 18 ఏళ్ల అనుబంధాన్ని, చిన్నప్పటి పాఠశాల రోజులనుండి రాహుల్ గాంధీ తో ఉన్న సాన్నిహిత్యాన్ని వదిలి పెట్టి బిజెపి గూటికి చేరాడు.

ఇంతజరిగినా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు రాలేదనడానికి తాజా ఉదాహరణ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను చూస్తే అర్ధమౌతుంది. మధ్యప్రదేశ్ నుండి ఒక స్థానాన్ని మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కేటాయించగా మరో స్థానాన్ని కమల్ నాథ్ కు అత్యంత సన్నిహితుడయియినా పూల్ సింగ్ బరయా కి కేటాయించింది. హర్యానా విషయంలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా కుమారుడు దీపేంద్ర సింగ్ కి కేటాయించింది.

అయితే మధ్యప్రదేశ్ తాజా సంక్షోభం నేపథ్యంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా, మధ్యప్రదేశ్ గుణపాఠం తో ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తీరిగ్గా ఇతర రాష్ట్రాల్లో దిద్దుబాటు చర్యలను చేపట్టింది. దీనిలో భాగంగానే చాలా రోజులనుండి ఖాళీగా ఉన్న కర్ణాటక పిసిసి అధ్యక్ష పదవిని సీనియర్ నేత డీకే శివకుమార్ ని నియమించింది. అయినా ఏమి లాభం అప్పటికే మధ్యప్రదేశ్ లో ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంత జరుగుతున్నా వరుస ఓటముల నుండి పాఠాలు నేర్చుకోకపోవడం కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతకు అద్దం పడుతుంది.