iDreamPost
android-app
ios-app

ఆసియా క్రికెట్ కప్ వేదిక దుబాయ్‌

ఆసియా క్రికెట్ కప్ వేదిక దుబాయ్‌

ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ దుబాయ్‌లో జరుగుతుందని, భారత్-పాక్ జట్లు రెండూ పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ దేశంలో ఆసియా కప్ జరగవలసి ఉంది. అయితే భద్రతా పరమైన కారణాల వల్ల దాయాది దేశానికి తమ జట్టును పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది.ఆసియా కప్‌ను పాకిస్తాన్ నిర్వహించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తటస్థవేదికపై నిర్వహిస్తే భారత్ పాల్గొంటుందని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసియా టోర్నీలో ఆడేందుకు భారత్ జట్టు రాకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌ని తాము బహిష్కరిస్తామని హెచ్చరికలు పంపింది. కానీ పీసీబీ హెచ్చరికను బీసీసీఐ పట్టించుకోకపోవడంతో భారత్ లేకుండా ఆసియా కప్‌ని నిర్వహిస్తే ఆర్థికంగా నష్టపోతామని పాకిస్థాన్ గుర్తించింది. దీంతో పునరాలోచనలో పడ్డ పాకిస్థాన్ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆసియా కప్‌ని నిర్వహించేందుకు బీసీసీఐతో చర్చలు జరిపింది.

మార్చి 3న జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ స‌మావేశానికి బ‌య‌ల్దేరేముందు గంగూలీ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్లో విలేకరులతో మాట్లాడాడు. ‘‘దుబాయ్‌లో ఆసియా కప్‌ జరుగుతుంది.దీనిలో భారత్‌, పాకిస్థాన్‌ రెండు దేశాలు తలపడతాయి’’ అని దాదా తెలిపాడు.మ‌రోవైపు న్యూజిలాండ్ పర్యటనలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా పడిన భారత్ పుంజ‌కుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.ప‌ర్య‌ట‌న‌లో మరో టెస్టు ఉంద‌ని గుర్తు చేసిన గంగూలీ టీమిండియా బౌన్స్ బ్యాక్ అవుతుంద‌ని వ్యాఖ్యానించాడు.ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుతమైన ఆట‌తీరుతో సెమీస్‌కు చేరింద‌ని భార‌త మ‌హిళా జ‌ట్టును గంగూలీ అభినందించాడు.

భారతదేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులతో 2012 నుంచి దాయాది దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లకి దూరంగా ఉంటున్నప్పటికీ తటస్థ వేదికలపై జరిగే వరల్డ్ కప్,ఆసియా కప్‌ లాంటి ఐసీసీ టోర్నీలలో మాత్రం తలపడుతున్నాయి.ఈ టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగనుండగా పాక్‌తో పాటు శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌,బంగ్లాదేశ్‌ జట్లు పాల్గొంటాయి.