iDreamPost
iDreamPost
ఎవరికి నచ్చినా..లేకున్నా అర్నబ్ గోస్వామీ ఇండియాలో వివాదాస్పద జర్నలిస్టులలో ఒకరు. అసోం నుంచి హస్తినకు వచ్చి, అనతికాలంలోనే గుర్తింపు పొంది, ఇప్పుడు ఒక టీవీ చానెల్ సహా యజమానికి గా మారిన క్రమంలో అర్నబ్ ప్రస్థానం ఆసక్తిగా కనిపిస్తుంది. ఇటీవల పూర్తిగా రైట్ వింగ్ ప్రతినిధిగా ఆయన తీరు కనిపిస్తోంది. మోడీకి బలమైన మద్ధతుదారుడిగానే కాకుండా, టీవీ చర్చలలో ఇతర పార్టీలు, భిన్నవాదనలు చేసే వారి పట్ల విరుచుకుపడే అర్నబ్ తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంటుంది. అందుకు తగ్గట్టుగా పెరుగుతున్న ఆదరణను చూసుకుని అర్నబ్ మరింత మురిసిపోతూ, తన శైలికి పదునుపెడుతున్నట్టు కనిపిస్తోంది.
ఆ క్రమంలోనే మహరాష్ట్రలోని పాలఘర్ లో జరిగిన సాధువుల హత్యా ఘటనపై చర్చ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా కొత్త చర్చకు తెరలేపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్వపు పేరుని ప్రస్తావించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలాకాలంగా కాంగ్రెస్ పట్ల విరుచుకుపడే అర్నబ్, ఈసారి ఏకంగా ఆపార్టీ అద్యక్షురాలిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలయ్యింది. ఆమె ఇటలీ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ సంబంధం లేని అంశంలో సోనియా పేరుని ప్రస్తావించడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. కేసులు కూడా పెట్టారు.
అంతటితో సరిపెట్టకుండా అర్నబ్ కి గట్టి మద్ధతుదారులున్న సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ నిర్వహించారు. #అరెస్ట్ యాంటీ ఇండియా ఆర్నబ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తూ అర్నబ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా జాతీయతను , పాత పేరుని కూడా ప్రస్తావించిన ఆర్నబ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో వివాదం బాగా ముదిరినట్టు కనిపించింది. దానికి కొనసాగింపు అన్నట్టుగా ముంబైలో తనపై దాడి జరిగిందంటూ అర్నబ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను, తన భార్య కారులో వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ముంబై పోలీసులు ప్రకటించారు.
అయితే అర్నబ్ నేపథ్యాన్ని పరిశీలిస్తే అను నిత్యం ఇలాంటి వివాదాలే ఆయనకు ఆయువుపట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వివాదాల ఆధారంగా పాపులారిటీ సంపాదించి, తన చానెల్ రేటింగ్స్ పెంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారని గిట్టని వారు వాదిస్తూ ఉంటారు. కానీ అర్నబ్ నిజమైన జాతీయవాదిగా ఆరాధించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.కానీ ప్రస్తుత విషయంలో మాత్రం అర్నబ్ మూలంగా ప్రారంభమయిన వివాదం ఆశావాహ పరిణామం కాదనేది పలువురి వాదన. ముఖ్యంగా దేశమంతా కరోనా కలకలం రేగుతోంది. అందులోనూ మహారాష్ట్రలో, ముంబై లో మరింత వేగంగా విస్తరిస్తోంది. అలాంటి సమయంలో వ్యక్తిగతంగా వివాదాలు రాజేసే ప్రయత్నం చేయడం సరికాదన్నది పలువురు సాధారణ వ్యక్తులు కూడా అబిప్రాయపడుతున్నారు.
పాలఘర్ ఘటనకు మతాలతో సంబంధం లేదని, కేవలం అపోహలతో జరిగిన మూకదాడిగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత వివాదం రాజేయడం, దాని చుట్టూ తీవ్ర కలకలం రేపే ప్రయత్నం సమంజసం కాదన్నది వారి వాదన. అయితే అర్నబ్ వ్యాఖ్యలను వివాదంగా మార్చిన కాంగ్రెస్ వల్లే ఇదంతా జరిగిందనే వారు కూడా ఉన్నారు. ఏమయినా ఇలాంటి విపత్తు కాలంలో అనవసర వివాదాలు ఆయా వ్యక్తులకు ఉపయోగం ఏమో తప్ప, ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు.