Idream media
Idream media
వందల కోట్ల రూపాయల ఈఎస్‌ఐ స్కాం తర్వాత సైలెంట్ అయిన మాజీ మంత్రి అచ్చెం నాయుడు.. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చారు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే అచ్చెం నాయుడు అందరి దృష్టి ఆకర్షిస్తారు. భారీ కాయం.. అందుకు తగినట్లు హావాభావాలు పలికిస్తూ.. వైసీపీ నేతలతో ఢీ అంటే ఢీ అంటుంటారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెం నాయుడు స్పీడు, స్వరం పెంచారు. తమ గత పాలనను ఏ మాత్రం పట్టించుకోకుండా.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు. తద్వారా సెల్ఫ్ గోల్ వేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నిన్నటి నుంచి మొదలయ్యాయి. పలు దఫాలు చర్చల తర్వాత.. ఈ సమస్య కొలిక్కి వచ్చింది. ఇరు రాష్ట్ర సంస్థలు రెండు రాష్ట్రాలలో సమానమైన దూరం బస్సులు తిప్పే విషయంలో ఒక ఒప్పందానికి రావడంతో సమస్య పరిష్కారమైంది. నిన్నటి వరకూ బస్సు సేవలు లేకపోవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు రాకపోకలు సాగించడంలో సమతమతమయ్యారు. తాజా ఒప్పదంతో గతంలో కన్నా ప్రస్తుతం ఏపీ బస్సులు తక్కువ కిలోమీటర్ల మేరనే తెలంగాణలో తిరగాల్సిన పరిస్థితి. ఏపీ బస్సులు తెలంగాణలో ఎంత మేర తిరుగుతాయో.. అంతే దూరం తెలంగాణ బస్సులు ఏపీలో తిరుగుతాయి. ఏమైనా.. సర్వీసుల పునఃప్రారంభం కావడంతో ప్రజలకు ఊరట లభించింది.
అయితే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అచ్చెం నాయుడు ఈ విషయాన్ని కూడా ఉపయోగించుకున్నారు. తెలంగాణలో ఉన్న జగన్ బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కిలోమీటర్లు తగ్గించుకోవడం వల్ల ఏపీ ప్రయోజనాలు తెలంగాణాకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆర్టీసీ సేవల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు, వాటి సారాంశం ఏమిటో అందరూ చూశారు. మీడియా కూడా ప్రత్యేకమైన కథనాలను ప్రచురించింది. ఎట్టకేలకు పీటముడి వీడి సర్వీసులు ప్రారంభం కావడం ఏపీ ప్రజలకు ఎంతో ఊరట నిచ్చింది. అయితే దీన్ని కూడా అచ్చెం నాయుడు తమ రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేసిన అచ్చెం నాయుడును వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నాయి. ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు ఎవరు తాకట్టు పెట్టారో ఒక సారి గతాన్ని గుర్తుచేసుకోవాలని అచ్చెం నాయుడుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా ఉంటుందని చట్టంలోనే ఉంది. అయితే రెండేళ్లకే హైదరాబాద్‌ను వదిలి కనీస సౌకర్యాలు లేని అమరావతికి పెట్టా బేడా సర్ధుకుని ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఏపీ ప్రయోజనాలను, పదేళ్ల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ను తెలంగాణాకు తాకట్టు పెట్టింది ఎవరనే వైసీపీ శ్రేణుల ప్రశ్నకు అచ్చెం నాయుడు వద్ద సమాధానం ఉంటుందా..? అంటే మౌనాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి.
2015లో ఓటుకు నోటు కేసు తర్వాత 2019 వరకూ నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నోటి నుంచి కనీసం హైదరాబాద్ అనే మాటే వినిపించలేదని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సొంత ఇళ్లు ఉన్నా.. బాబు వచ్చేది.. పోయేది కూడా ఎవరికీ తెలిసేది కాదనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అచ్చెం నాయుడుకు కౌంటర్లు ఇస్తున్నారు.