Idream media
Idream media
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత దాదాపు రెండు నెలలుగా స్తబ్ధుగా ఉన్న మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష పదవి రావడంతో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. కాలికి గజ్జె కట్టుకుని మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తానని పదవి వచ్చిన సందర్భంగా చెప్పిన అచ్చెం నాయుడు.. ఈ దిశగా మరిన్ని ప్రకటనలు చేస్తున్నారు. అచ్చెం నాయుడు రాకతో టీడీపీకి కొత్త ఊపు వచ్చిందని చెప్పేందుకు తనదైన హావాభావాలతో అచ్చెం నాయుడు గాలిలో పిడగుద్దులు గుద్దుతున్నారు.
టీడీపీకి ఆది నుంచి అండగా ఉన్నా బీసీలలో గత ఎన్నికల్లో కొంత విభజన వచ్చిందని అచ్చెం నాయుడు చెబుతున్నారు. వైఎస్ జగన్ చెప్పిన మోసపు మాటలు విని కొంత మంది బీసీలు వైసీపీకి ఓటేశారని చెప్పుకొస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పథకాలు ఆగిపోవడం, అడుగడుగునా అణిచివేయడంతో మళ్లీ బీసీలు టీడీపీ వైపు చూస్తున్నారని మూసపద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పాత చింతకాయ విధానంతో కూడిన రాజకీయాలు చేయడం వల్ల ప్రస్తుత సమయంలో ఎలాంటి ప్రయోజనం ఉండబోదనేది అందరూ చెప్పే మాట.
ప్రజా చైతన్యం పెరిగింది, ప్రభుత్వం ఏ పని చేస్తుంది..? తమకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది..? ప్రతిపక్షం ఎలా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది..? అనే అంశాలు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తాము ఏం చేస్తుందీ రాతపూర్వకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేస్తోంది. ఏ ఏ పథకాల ద్వారా ఎంత మందికి, ఎంత మేర లబ్ధి చేకూరిందో గణాంక సహితంగా తెలియజేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అనధికారిక శ్వేతప్రతం ప్రకటిస్తోంది.
ఇలాంటి తరుణంలో అచ్చెం నాయుడు ఇంకా పాత పద్ధతిలోనే పిడికిలి బిగించి గాలిలోకి విసిరితే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. గణాంక, ఆధారసహితంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలు ప్రజల మెప్పును పొందగలుగుతాయి. చీటికిమాటికి.. ఏదో విమర్శలు, ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో పని చేయడం వల్ల లాభం కన్నా.. ప్రతిపక్ష పార్టీకి నష్టమే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం విధానాల్లోని లోపాలు, పాలనలో వైఫల్యాలు ఉంటే.. వాటిని ఎత్తిచూపడం ద్వారా మాత్రమే ప్రతిపక్షం ప్రజల మనస్సును చూరగొనే అకాశం ఉంటుదన్న విషయం పెద్దగా చదువుకోకపోయినా.. రాజకీయ అనుభవం బాగా ఉన్నా అచ్చెం నాయుడుకు తెలియదనుకోవడానికి అవకాశం లేదు.
వైసీపీ వచ్చిన తర్వాత బీసీలకు పథకాలు ఆగిపోయాయని అంటున్న అచ్చెం నాయుడు.. ఆగిపోయిన ఆ పథకాలు ఏమిటి..? వాటి వల్ల బీసీలకు వచ్చిన నష్టం ఎంత..? అనే వివరాలు చెబితే ఆయన విమర్శలను ప్రజలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే.. చీకట్లో రాయి విసిరినట్లుగానే అచ్చెం నాయుడు పని తీరు ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు.