iDreamPost
android-app
ios-app

నాడు నిర్లక్ష్యపు చావులు , నేడు చిరునవ్వులు-ఇంటివద్దకు పింఛన్

  • Published Feb 01, 2020 | 1:20 PM Updated Updated Feb 01, 2020 | 1:20 PM
నాడు నిర్లక్ష్యపు చావులు , నేడు చిరునవ్వులు-ఇంటివద్దకు పింఛన్

అవును గతం గమనిస్తే బాబు గారి జమానాలో ఏ సంక్షేమ పధకమైనా లబ్దిదారుడికి చేరాలంటే తలప్రాణం తోకలోకైనా రావాలి , లేదా పూర్తి ప్రాణం పోవాలి . 1999 , 2004 కాలంలో ఓ గ్రామంలో కొత్త పెన్షన్ రావాలంటే పాత పెన్షన్ రాలిపోవాలి . నేటి కాలం వారికి విడ్డూరం అనిపించొచ్చు కానీ నిజం . ఊళ్ళో ఎవరైనా పింఛన్ దారుడు చనిపోతేనే కొత్తగా మరొకరికి పింఛన్ ఇచ్చేవారు . నాటి బాబు గారి జమానాలో రూల్ అది . వైఎస్ గారు అధికారంలోకి రాగానే ఆ నిబంధనని తోసిరాజని అర్హులందరికీ 200 చొప్పున పింఛన్ అందించి ఆయా కుటుంబాల్లో వృద్ధులకు పెద్ద బిడ్డయ్యాడు .

కాలం మారి మళ్లీ 2014 లో బాబు గారి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం వర్గ రూపు దాల్చింది . జన్మభూమి కమిటీలకు ఎంపిక అధికారాలు ఇచ్చి తమ పార్టీ వారికీ , వర్గాల వారీగా ఎంచి నిబంధనలు అతిక్రమించి ఇచ్చుకోవటమే కాక వైరి పార్టీలకి చెందిన అర్హుల అర్జీలను తుంగలో తొక్కి దారుణమైన వివక్ష చూపారు . ఇహ ప్రతి పెన్షన్ కూ , సంక్షేమ పధకానికీ జన్మభూమి కమిటీ సభ్యులకు నజరానా తప్పనిసరి . టీడీపీ దారుణ ఓటమిలో ఈ కమిటీల పాత్ర అధికమే.

అంతే కాదు అర్హులకు ఇచ్చే పెన్షన్లను సైతం సజావుగా అందించక తమ పార్టీ ప్రచారం కోసం గ్రామాల్లో అందర్నీ ఒకచోటకి పిలిపించి గుమిగూడాక వారితో పార్టీకి అనుకూలంగా వీడియోస్ తీసుకొని ఆ తర్వాత పెన్షన్లు పంచేవారు . మేజర్ పంచాయితీలు కానీ చిన్న గ్రామాల వారి బాధ అయితే చెప్పనలవి కాదు . కర్నూల్ జిల్లాలో వెంకటగిరి , పెండెకల్లి లాంటి గ్రామాల వారు ప్రతి నెలా బేతంచర్ల వరకూ ఎనిమిది కిలోమీటర్లు వెళ్లి పెన్షన్ , రేషన్ తెచ్చుకొనేవారంటే అప్పటి దుస్థితి ఆలోచించండి .

అంతే కాదు విజయవాడలో మరి కొన్ని చోట్ల పెన్షన్ కోసం క్యులల్లో నిలబడి మరణించిన ఘటనలు , తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలు కోకొల్లలు . అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటానికి ఏనాడూ ఆసక్తి చూపని టీడీపీ పార్టీ 2019 ఎన్నికల ముందు మాత్రం హఠాత్తుగా వెయ్యిగా ఉన్న పింఛన్ ని రెండు వేలు చేసింది .

అదే ఎన్నికలలో రెండు వేలుగా ఉన్న పెన్షన్ ని తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మూడు వేలకి పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే పెన్షన్ 2250 రూపాయలకు పెంచటమే కాక వృద్ధ , వికలాంగ , వితంతు పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇంటివద్దే అందించే బృహత్తర కార్యక్రమానికి విలేజ్ వలంటీర్ వ్యవస్థ ద్వారా నేడు శ్రీకారం చుట్టారు .

ఆయా గ్రామాల్లోని విలేజ్ వాలంటీర్లు నేడు ప్రతి గ్రామం , ప్రతి వార్డ్ , ప్రతి ఇంటి తలుపు తట్టి అర్హులను పలకరించి వారి వేలిముద్ర తీసుకొని పధకం తాలూకు సొమ్ముని వారికందించే కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి లోగిలిలో పండగ కళ తీసుకొచ్చిందంటే అతిశయోక్తి కాదు .

గ్రామ సీమ లోగిళ్ళల్లో ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొల్పాలన్న నా తండ్రి కల నేను నెరవేరుస్తాను అన్న జగన్ మాట నిలుపుకొనే దిశగా ఓ గొప్ప ముందడుగు వేశాడని చెప్పొచ్చు .

నాటి బాబు జమానాకి , నేటి జగన్ సంక్షేమానికి తేడా స్పష్టంగా చూపిన జగన్ ఈ విషయంలో ఖచ్చితంగా అభినందనీయుడు .