iDreamPost
iDreamPost
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకి గట్టి వార్నింగ్ వచ్చింది. తమ మాజీ అధ్యక్షుడి మాటలతో తమకు సంబంధం లేదని ఆ సంఘం ప్రకటించింది. తాజాగా టీడీపీ విజయంలో తమ పాత్ర ఉందన్నట్టుగా అశోక్ బాబు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టింది. అలాంటి మాటలు సహించేది లేదని హెచ్చరించింది. అశోక్‌బాబు చెప్పేవన్నీ అవాస్తవాలు అంటూ మండిపడింది. తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని స్పష్టం చేసింది.
టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్ బాబు వ్యవహారశైలిని ఏపీ ఎన్జీవోలు తీవ్రంగా నిరసించారు. ‘‘అశోక్‌బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో పేరు ఎత్తితే సహించేదిలేదని’’ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్‌బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్ బాబు అంటూ ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశోక్‌బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్‌బాబు అని, వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అశోక్‌బాబుపై బొప్పరాజు నిప్పులు చెరిగారు. ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత అశోక్ బాబుకి లేదన్నారు.
ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్సీ పదవి పొంది, ఇప్పుడు ఉద్యోగ సంఘాల మీద కుసంస్కారంతో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించానని స్వయంగా అశోక్‌బాబే ఒప్పుకున్నారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని గుర్తు చేశారు. వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైనతే హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపైన కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
దాంతో ఓ టీవీ చానెల్ చర్చలో తాను నిబంధనలు అతిక్రమించినట్టు అంగీకరించిన అశోక్ బాబు తీరు పెద్ద వివాదంగా మారబోతోంది. ఆయన మీద చర్యలకు ఉద్యోగ సంఘాలు పూనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఎలా స్పందించబోతోందన్నది చర్చనీయాంశం అవుతోంది.