iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి కథకు తెరపడుతోంది. ప్రస్తుతం తీర్మానం ఆమోదించిన ఏపీ ప్రభుత్వం తన పని పూర్తి చేసింది. ఇక కథ కేంద్రం చేతుల్లో ఉంది. వెంటనే చేస్తుందా..ఊరించి , కాలయాపన చేస్తుందా అన్నది త్వరలో తేలుతుంది. ఊహాగానాలు పక్కన పెడితే మండలి కథ ముగింపు దశకు వచ్చినట్టుగానే భావించాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియలో పార్టీల తీరు ఆసక్తిదాయకంగా ఉంది. అధికార పార్టీతో పాటు విపక్షం కూడా పునరాలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతోంది. మండలి అనూహ్యంగా తెరమరుగయ్యే ప్రమాదం రావడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష టీడీపీ నేతలే అన్నది మెజార్టీ అబిప్రాయం. అదే సమయంలో పాలక వైసీపీ తీరు కూడా అందుకు కారణంగానే భావించాల్సి ఉంటుంది.
ముందు నుంచీ వైసీపీ మండిపడుతోంది…
శాసనమండలి విషయంలో వైసీపీలో కొంతకాలంగా చర్చ సాగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లుల విషయంలో సహించలేని దశకు వచ్చింది. దాంతో శాసనమండలిని రద్దు చేసే అధికారం తమకు ఉందంటూ ఆర్టికల్ 169ని ముందుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి ప్రతిపాదిస్తూ చేయాల్సిన తీర్మానంలో ఓటింగ్ వరకూ వెళ్లింది. అయితే అధికార పార్టీకి చెందిన 18 మంది సభ్యులు ఓటింగ్ కి దూరం కావడం అందరినీ విస్మయపరిచింది. అధినేతకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆపార్టీలో సమన్వయ సమస్యను అందరికీ చాటింది. చివరకు ఇద్దరు విప్ లు కూడా ఓటింగ్ సందర్భంగా సభలో కనిపించకపోవడం ఆపార్టీ తీరుని చాటుతోంది.
Read Also: మండలికి మంగళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం
మండలి బిల్లుకి ఓటింగ్ విషయం ముందే అవగాహన లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. కానీ పార్టీ నాయకత్వమే ముందుగా అలాంటి సమాచారం ఇవ్వడంలో విఫలమయినట్టుగా కొందరు చెబుతున్నారు. సభ్యులందరినీ దానికి తగ్గట్టుగా సన్నద్ధం చేయాల్సి ఉండగా జరిగిన జాప్యంతో ఈ పరిస్థితి వచ్చిందని, రెండుసార్లు లెక్కలు వేయాల్సిన అఘాయిత్యం దాపురించిందని సీనియర్లు అంటున్నారు.
అసెంబ్లీ లో జరిగిన పరిణామాలతో పాటుగా సభ వెలుపలి జరిగిన ప్రచారాన్ని కూడా సీఎం సమర్థవంతంగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మాట మార్చిన తీరుని సభ ముందుంచి సవాల్ చేయగలిగారు. సామాన్యుడిని సైతం అంగీకరించేలా చేయగలిగారు. అయితే విపక్షం వైఫల్యాలతో పాటుగా మండలి రద్దుకి బలమైన కారణాలను ప్రజల ముందుంచడానికి ఇంకా కొంత కృషి చేసి ఉంటే బాగుండేదని పరిశీలకుల అభిప్రాయం. ముఖ్యంగా ఎన్టీఆర్ మండలి రద్దు చేసినప్పుడు ఖర్చుని ప్రధానంగా చూపించారు. జగన్ కూడా అదే చెప్పడం ఆశ్చర్చం అనిపించింది. ఇతర కారణాలు కూడా ఎన్టీఆర్ కాలం నాటివే చెప్పారు. కానీ బిల్లులు మండలిలో జాప్యం జరగడం మూలంగా జరుగుతున్న నష్టాన్ని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేయడానికి సిద్ధం కాలేదు. ఉదాహరణకు ఇంగ్లీష్ మీడియం విషయంలో నేటికీ చట్ట రూపం దాల్చలేదు. దాంతో ఫిబ్రవరి నుంచి ఉపాధ్యాయులను సన్నద్ధం చేయాల్సిన ప్రక్రియ ఆలశ్యం అయ్యింది. దాంతో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఇది సామాన్యుడికి చేటు చేస్తుంది అంటూ ప్రజలకు వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ప్రజలకు మరింత నేరుగా సంబంధం అనిపించేది.
అనూహ్య ఎత్తులతో విలవిల్లాడుతున్న విపక్షం
అధికార పక్షం విషయంలో చంద్రబాబు పూర్తిగా అవగాహనారాహిత్యంతో వ్యవహరించినట్టు కనిపిస్తోంది. అనుభవం ఆయనకు అక్కరకు వచ్చినట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ తీరు ను ఆయన తక్కువ చేసి చూడడంంతోనే చిక్కుల్లో పడ్డట్టు కనిపించింది. రాజకీయ కారణాలతో మండలిని తాము వినియోగిస్తే రాజకీయంగా మండలికి మంట పెడతారనే ఆలోచన లేకుండా వ్యవహరించిన చంద్రబాబు మూలంగానే మండలికి మంగళం పాడే పరిస్థితి వచ్చిందన్నది సుస్పష్టం. అందుకు యనమల వంటి వారి ప్రోత్సాహం, ఒత్తిడికి గురయిన చైర్మన్ షరీఫ్ వ్యవహారం తోడు కావచ్చు గానీ ప్రధాన పాత్ర మాత్రం చంద్రబాబుదే అనడంలో సందేహం లేదు.
Read Also: సజ్జల చెప్పిన 17 మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో మిగిలే ఆ నలుగురు ఎవరు..?
మండలి కి ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను పూర్తి చేయడంతో ఇంకా జాప్యం జరుగుతుందనే దింపుడు కళ్లెం ఆశ తప్ప ప్రతిపక్షంలో పూర్తిగా నైరాశ్యం అలముకుంది. ఇలాంటి పరిస్థితి ఊహించకపోవడమే దానికి కారణం. సెలక్ట్ కమిటీ పేరుతో సంబరాలు జరుపుకున్న తమకు ఆ ఆనందం వెంటనే ఆవిరి అయిపోతుందని ఊహించని టీడీపీ శిబిరం ఇప్పుడు తలలు పట్టుకుంటుంది. రెండేళ్ల తర్వాత వైసీపీకి సభలో ఆధిక్యం దక్కే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి శాసనమండలి సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఒక్క అమరావతి కోసం ఆహూతి చేసుకోవడంలో వ్యూహం బెడిసికొట్టిందనే విషయం ఇప్పుడు బోధపడినా, ఫలితం చూసి బాధపడినా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ ఎపిసోడ్ లో ఎక్కువ నష్టపోయిన పార్టీగా తెలుగుదేశం మిగిలిపోయింది. అదే సమయంలో పదే పదే మాట మార్చే నేతగా చంద్రబాబు పై జనాభిప్రాయం బలపడింది. సొంత కుమారుడు సహా పలువురు ప్రోటోకాల్ కోల్పోవాల్సి వస్తోంది. 1983 నుంచి శాసనసభలో గానీ, మండలిలో గానీ నిరంతరాయంగా సభ్యుడిగా ఉన్న యనమల వంటి వారికి అలాంటి అవకాశం చేజారిపోయింది. అన్నింటికీ మించి అమరావతి రైతుల ముందు ఏదో సాధించామని చెప్పుకున్న నేతలకు ఇప్పుడు ఏం చెప్పాలో తెలియని సందిగ్ధం నెలకొంది. మొత్తంగా టీడీపీకి శిరోభారంగా శాసనమండలి వ్యవహారం మారిపోయింది.
గోడమీద పిల్లిలా బీజేపీ
ఏపీ రాజకీయాల్లో బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలో సాగుతోంది. అవకాశవాదంతో వ్యవహరిస్తోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య విబేధాలు తమకు ఉపయోగపడతాయనే ధ్యాస తప్ప ఏపీ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల అవసరాలు పడుతున్నట్టు లేదు. అమరావతిని కొనసాగించాలని ఓవైపు చెబుతూ రాయలసీమలో హైకోర్ట్ కి మద్ధతు అంటూ మరో వైపు మాట్లాడడం ఆపార్టీ కూడా చంద్రబాబు మాదిరి రెండు కళ్ల సిద్ధాంతం ప్రదర్శించాలని చూస్తోంది. ఇది చివరకు కాంగ్రెస్ మాదిరిగానే కమలం కూడా ప్రజల ముందు దోషిగా మిగిలే స్థితిని చేర్చే ప్రమాదం ఉందని అర్థమవుతున్నా కాషాయ పార్టీకి అర్థమవుతున్నట్టు కనిపించడం లేదు.
Read Also: కౌన్సిల్ క్యాన్సిల్.. దారితీసిన పరిణామాలు… చంద్రబాబు చక్రం తిప్పుతారా..?
ప్రత్యేక హోదా విషయంలో కూడా ఒక స్పష్టత లేకుండా చివరి వరకూ నాన్చి నాన్చి కనుమరుగయ్యేలా చేశారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు విషయంలో కూడా బీజేపీ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించింది. మండలి కూడా అదే తంతు. ఇక ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లిన నేపథ్యంలో ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాల్సిన అంశం. ఏపీ అభివృద్ధితో ముడిపడిన నిర్ణయాల విషయంలో జాప్యం లేకుండా వీలయినంత వేగంగా నిర్ణయం వెలువరించడం ద్వారా చిత్తశుద్దిని చాటుకోవాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా ఆలశ్యం చేయాలని చూస్తే ఆపార్టీకి ఏపీలో మరింత నష్టం తప్పదని చెప్పవచ్చు.
జనాభిప్రాయాలు పట్టని జనసేనానికి ఝలక్
జనాభిప్రాయాలను పార్టీ అధినేత పట్టించుకోకపోవడంతో ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే తన దారి తాను చూసుకున్నారు. జగన్ నిర్ణయాలకు జై అంటున్నారు. సభలో జరుగుతున్న పరిణామాలు జనసేనకు ఝలక్ గానే భావించాల్సి ఉంటుంది. శాసనమండలి రద్దు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటనకు, సభలో ఆపార్టీ నిర్ణయానికి పొంతన లేకపోవడంతో జనసేన పయనం పూర్తి గందరగోళంగా కనిపిస్తోంది. ఏకైక ఎమ్మెల్యేని కూడా తన విధానాలకు అనుగుణంగా నడిపించలేని అసమర్థత పవన్ నాయకత్వంలో ఉందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. అదే సమయంలో అమరావతిని కదిలించలేరని చేసిన ప్రకటనలకు భిన్నంగా జగన్ తన పని తాను చేసుకుపోతుండడంతో జనసేన మరింత పరిహాసం అవుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా జనసేనాని మీద విశ్వాసం సన్నగిల్లే పరిణామాలకు ఇవన్నీ దారితీసేలా ఉన్నాయి.
మొత్తంగా అన్ని పార్టీలకు శాసనమండలి ఎపిసోడ్ పలు పాఠాలు నేర్పుతోంది. నేర్చుకున్న వాళ్లు నిలబడతారు.. నాకేంటి అనుకుంటే మరింత లోతుల్లో కూరుకుపోతారనడంలో సందేహం లేదు.